Amaravathi: స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం ఏమవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవిన్యూ అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. గ్రామీణులకు సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధుల భయం లేకుండా చూడాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి పని చేయాలని, తాగు నీటి సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ మేరకు కాకినాడ, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా ప్రబలడంతో పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్., వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు శారీ చేశారు. సమీక్షలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలి..
వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు ఓ సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని పవన్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఏటా వర్షా కాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయని, వారి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాగు నీటి కాలుష్యం మూలంగానే డయేరియా, విష జ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని, శుద్ధమైన జలం అందించేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవలే కాకినాడ జిల్లా కొమ్మనపల్లి, బెండపూడి గ్రామాల్లో అతిసారం కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.
నిధులు, ఆదాయాన్ని గత అయిదేళ్లలో మళ్లించి..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని గత ప్రభుత్వం సి.ఎఫ్.ఎం.ఎస్. ద్వారా మళ్లించేయడంతో గ్రామాల్లో రక్షిత తాగు నీరు కూడా అందించలేని పరిస్థితి నెలకొన్న విషయాన్ని ఈ సమీక్షలో గుర్తించారు. స్థానిక సంస్థల నిధులు, ఆదాయాన్ని గత అయిదేళ్లలో మళ్లించడంపై పవన్ అధికారులను ప్రశ్నించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఏ ఆర్థిక సంవత్సరం, ఎంత మేర నిధులను మళ్లించారనే విషయాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. నీటి కాలుష్యాన్ని గుర్తించాం. గ్రామాల్లో ప్రతి బుధవారం కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా తాగు నీటి సరఫరా ఎక్కడి నుంచి చేస్తున్నారో అక్కడ శాంపిళ్లు తీసి పరీక్షించే వ్యవస్థ ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల మొదటి రెండు వారాల్లో 10,047 శాంపిళ్లు తీస్తే 217 శాంపిళ్లలో బాక్టీరియా వల్ల కలుషితం అయినట్లు గుర్తించామని తెలిపారు.
డయేరియా బాధితుల ఘటనలపై..
దీంతో వెంటనే స్పందించిన పవన్ సదరు వాటర్ సోర్సెస్ దగ్గర నుంచి సరఫరా ఆపివేసి తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల అంశంతోపాటు, ఇటీవల విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ, తాగునీరు కలుషితమై ప్రజలు డయేరియా బారిన పడిన ఘటనలపై మంత్రులు అధికారుల వివరణ కోరారు. తాగు నీటి పైపు లైన్లలో డ్రైనేజీ నీరు కలసిపోతుండటంతో నగరాలు, పట్టణాల్లో అతిసారం కేసులు నమోదవుతున్నాయని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తాగు నీటి సరఫరా పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పైపు లైన్ల తనిఖీ ఎప్పటికప్పుడు జరిగేలా చొరవ తీసుకోవాలని, ఎక్కడైనా మరమ్మతులు అవసరం అయితే తక్షణమే చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుండా పని చేయాలని చెప్పారు. మూడు శాఖలు కలసి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ తగదని, ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ముందుగానే పసిగట్టి, వాటిని నివారించేలా అధికారులు కింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ సదా సిద్ధంగా ఉండాలని, పంచాయతీరాజ్, పురపాలక అధికారులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. వచ్చే సీజన్ లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసే బాధ్యతను తీసుకోవాలని కోరారు. ప్రజల్లో సైతం వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, నీటిని కాచి తాగడం గురించి ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు.