ఆప్కాబ్ రైతులకు అందించిన సేవలు విశేషమైనవని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర సహకార రంగం చరిత్రలో ఆప్కాబ్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆప్కాబ్ తన 60 ఏళ్ల ప్రయాణంలో రైతులకు అండగా నిలబడిందన్నారు. రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే బతుకుతాడు చివరికి అప్పుల్లోనే చనిపోతాడన్న ఓ నానుడి ఉండేదని, కానీ బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గరకు అడుగులు వేడయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్కాబ్ ను నిలబెట్టడంలో కీలక పాత్ర వహించారని కొనియాడారు. ఆప్కాబ్ లో వైఎస్సార్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఆప్కాబ్ సేవలన్నీ మరింతగా విస్తరిస్తున్నాయన్నారు. ఆర్‌బీకే స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్‌బీకేలు రైతుల చేయి పట్టుకుని నడిస్తున్నాయని, ఆర్‌బీకేలను ఆప్కాబ్ తో అనుసంధానం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ చర్రితలోనే ఆప్కాబ్ కు మంచి గుర్తింపు ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చూస్తామని తెలిపారు సీఎం జగన్.
చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోందని ప్రశంసించారు. ఆప్కాబ్ రైతులకు ఇస్తున్న చేయూత ఎనలేనిదన్నారు. రైతులకు ఆప్కాబ్ వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. సహకార బ్యాంకులు తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నాయని గుర్తు చేశారు. డిజిటలైజేషన్ తో సేవలు మరింత వేగం అందుకున్నాయన్నారు. రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని సీఎం అన్నారు.
బ్యాంకులోగో ఆవిష్కరణ
అనంతరం సీఎం బ్యాక్ నూతన లోగో, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. కొత్త బ్రాండ్ సంకల్ప్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. 13 డీసీసీబీలకు డివిడెండ్ల పంపిణీతో పాటు బ్యాంక్ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. సీఎం జగన్ కు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యే లు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
ఆప్కాబ్ చరిత్ర
1963 లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ ప్రారంభమైంది. ఆప్కాబ్ పరిధిలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 1995 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.36,732 కోట్ల టర్నోవర్ సాధించింది ఆప్కాబ్. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ నాలుగేళ్లలో రూ.251 కోట్ల లాభాల్లోకి ఆప్కాబ్ వెళ్లింది. రెండు సార్లు జాతీయ అవార్డులను సాధిచింది.