TDP-Janasena-BJP Alliance: కూటమిలో కుమ్ములాటలు

TDP-Janasena-BJP Alliance: కూటమిలో కుమ్ములాటలు
New Update

 TDP-Janasena-BJP Alliance: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్డీయే కూటమిలో సీటు పోట్ల కుమ్ములాటలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అభ్యర్థులు, సీట్ల పంచాయితీలు ఇంకా కొనసాగుతున్నాయి. కూటమి పార్టీల మధ్య కీచులాటలతో పాటు కులాల కుంపటి కూడా రాజుకుంది. మిగిలిన మిత్రపక్షాల కంటే జనసేనకే ఈ సెగ గట్టిగా తగులుతోంది.

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో సీట్లు, అభ్యర్థుల పంచాయితీలు ఇంకా నడుస్తున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో కూటమి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సిన స్థానాలు 19 ఉన్నాయి. ఈ పెండింగ్ సీట్లలో టీడీపీకి దక్కే స్థానాలు.. చీపురుప‌ల్లి, భీమిలి, దర్శి, అనంతపురం అర్బన్‌, గుంతకల్లు, ఆలూరు లేదా ఆదోని ఉన్నాయి. ఇక బీజేపీకి కేటాయించే 10 అసెంబ్లీ స్థానాల్లో…ఎచ్చెర్ల, పాడేరు విశాఖ నార్త్‌, కైకలూరు, విజయవాడ వెస్ట్‌, ఆలూరు లేదా ఆదోని, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, రాజంపేట ఉన్నాయి. ఇప్పటికే 18 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన…ఇక పాలకొండ, విశాఖ సౌత్‌, అవనిగడ్డ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది.

అయితే ఆదోని, ఆలూరు సీట్లపై టీడీపీ, బీజేపీ మధ్య మడత పేచీ నడుస్తోంది. ఆదోని బదులు ఆలూరు లేదా ఇప్పటికే టీడీపీ అభ్యర్థి బరిలో నిలిచిన ఎమ్మిగనూరు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. దీనికి టీడీపీ ససేమిరా అంటోంది. మరోవైపు మూడో విడతల్లో కలిపి 138 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 6 సీట్లకు ఆ పార్టీ కేండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. ఇక రాజంపేట స్థానం టీడీపీ తీసుకుంటే దానికి బదులుగా ఇప్పటికే ప్రకటించిన అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఈ సీటును ఏపీ బీజేపీ మాజీ చీఫ్‌ సోము వీర్రాజు అడుగుతున్నారు.

మరోవైపు జనసేన ఇప్పటిదాకా ప్రకటించిన 18 అసెంబ్లీ సీట్లలో 12 స్థానాలను ఓసీలకే కేటాయించడంతో, ఆ పార్టీలో కులాల కుంపటి రగిలింది. బీసీలకు రెండే సీట్లు కేటాయించడంతో ఆ వర్గాలు జనసేన అధిష్టానంపై మండిపడుతున్నాయి. అనకాపల్లి, నరసాపురం స్థానాల్లో మాత్రమే బీసీ క్యాండిడేట్స్‌ను నిలబెట్టింది. శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబ ,చేనేత కులాలకు.. జనసేన నుంచి ప్రాతినిధ్యం దక్కలేదు. ఇక మహిళా కోటాలోనూ ఒక్కరికే చాన్స్‌ దక్కింది. మైనారిటీలకు జనసేన ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో ఆ వర్గాలు కూడా మండిపడుతున్నాయి. పవన్‌ పార్టీలో అగ్ర కులాలకే పెద్ద పీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక జనసేనలో వలస నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. చాలా స్థానాల్లో అలాంటి నాయకులకే అవకాశం ఇచ్చారన్న అసంతృప్తి.. నేతల్లో కబడుతోంది. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడంతో జనసేనలో చిచ్చు రగిలింది. మొదటినుంచి పార్టీ కోసం పనిచేసిన బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్తా శశిధర్, రియాజ్, పితాని బాలకృష్ణ వంటి నేతలకు టిక్కెట్లు దక్కకపోవడంతో కేడర్‌ మండిపడుతోంది. ఇక మిగిలింది మూడే సీట్లు.. ఇప్పటికైనా న్యాయం చేయాలని ఓ వర్గం అంటుంటే, ఈ మూడింటితో ఎంతమందికి న్యాయం చేస్తారని మరో వర్గం ప్రశ్నిస్తోంది. జనసేన హైకమాండ్‌ ఈ మూడు స్థానాల్లో ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి..!

#pawan-kalyan #chandrababu #ap-elections #tdp-janasena-bjp-alliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe