'పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తాటతీస్తా నా***...' జగన్‌పై పవన్ పేల్చిన డైలాగ్ ఇది..! ఇదేదో సినిమా డైలాగ్ అంటూ వైసీపీ అభిమానులు పవన్‌ను ఎగతాళి చేశారు.. అయితే మాస్ డైలాగులు జనాల్లోకి ఎంత లోతుగా వెళ్తాయో ప్రస్తుతం ఏపీ ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. జగన్‌కు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ చేశారు పవన్. ఏపీలో జనసేన పోటి చేసిన ప్రతిచోటా పంజా విసిరింది.. అటు జనసేనతో జతకట్టిన టీడీపీ భారీగా లాభపడింది. వైసీపీని టీడీపీ తుక్కుతుక్కు చేసిందంటే దాని వెనుక ఉన్నది జనసేన సైనికులే. ఇదంతా నంబర్ల పరంగా కనిపించకపోయినా ఓవరాల్‌గా పవన్ ఇంపాక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు!
యూత్ ఓట్లతో లాభపడ్డ కూటమి:
నిజానికి ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత మహిళంతా వైసీపీ ఓటు వేశారన్న ప్రచారం జరిగింది. ఇదంతా తప్పని ఫలితాలు చూస్తే తెలిసిపోతోంది. ఇటు ట్రెడిషనల్‌గానే పవన్‌కు యూత్‌ను అట్రాక్ట్ చేసే నైజం ఉంది. అందుకే ఆయన ఎక్కడ సభ పెడితే అక్కడ యువత భారీగా తరలివచ్చేది. పవన్ సభకు వచ్చేవారిలో అన్ని వయసుల వారు ఉంటారు కానీ ఎక్కువగా కనిపించేది యూతే. ఆయన మాటలు, బాడీ లాంగ్వేజ్ యువతను కట్టిపడేస్తాయి. ఇదే జనసేనకు బలంగా మారింది. ఇదే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి భారీ విజయాన్ని అందించింది. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములకు యువత ఓట్లే ప్రధానం. వారిని ఆకర్షించడంలో జనసేనాని సూపర్ సక్సెస్ అయ్యారు.
ఆ నిర్ణయమే కూటమి గెలుపుకు మూలం:
2019 ఏపీ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇటు పవన్ తాను పోటి చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో పవన్ పనైపోయిందన్నారు. ఇక రాజకీయాల మానేసి సినిమాలు చేసుకుంటే బెటర్ అని వెటకారంగా మాట్లాడారు. ఈ విమర్శలు చేసిన వారిలో అటు వైసీపీతో పాటు ఇప్పుడు జనసేన మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా ఉంది. అయితే పవన్ ఎక్కడా కూడా కుంగిపోలేదు. వెన్ను చూపని వీరుడిలా పోరాడారు. 2019లో కమ్యూనిస్టులతో వెళ్లిన జనసేన వారితో లాభం లేదని కాస్త లేట్‌గా తెలుసుకున్నా సరైన సమయంలో మాత్రం మోదీ పక్షాన చేరారు. ఇది పవన్ తీసుకున్న మంచి అడుగుగా చెబుతుంటారు విశ్లేషకులు. ఈ నిర్ణయమే తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి కారణమైంది.. 2024 ఎన్నికల్లో విజయానికి అతి పెద్ద కారణంగా నిలిచింది.
ఆ పట్టుదలే వైసీపీని ఓడించింది:
ఈ ఐదేళ్లలో ఎన్నో అవమానాలు భరించిన పవన్ ఇటు టీడీపీ అటు బీజేపీ మధ్య వారధిగా నిలిచారు. ఇరు పార్టీలకు సయోధ్య కుదురుతుందో లేదోనన్న అనుమానం ఉన్నా ప్రతీసారి పవన్ ఓట్ల చీలనివ్వకుండా కూటమి ఏర్పడేలా కృషి చేశారు. పవన్‌ను ఎలాగైన అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వబోమని వైసీపీ ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసింది. అయినా పవన్ మాత్రం తన ప్లాన్‌నే నమ్ముకున్నారు. ఎన్నో సర్వేలు, నివేదికల తర్వాత పిఠాపురం నుంచి పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు పిఠాపురం నుంచి గెలిపొంది అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు. అటు తన అభ్యర్థుల కోసం పవన్ నియోజవర్గాల్లో పర్యటించారు. ఇది అందరు చేసే విషయమేనైనా కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ అభ్యర్థులకు సైతం పవన్ ప్రచారం చేశారంటే ఆయనలో వైసీపీని ఓడించాలన్న పట్టుదల ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు.. ఆ కసీ, ఆ పట్టుదలే జగన్ పార్టీ పతనానికి కారణమయ్యాయి. కూటమి గెలుపుకు దారులు వేశాయి.
కులముద్ర పడకుండా జాగ్రత్తలు:
ఈ ఐదేళ్ల ప్రయాణంలో పవన్‌కు ఎదురైన అటుపోట్లు, సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే పవన్ సొంత కులమైన కాపు పెద్దల నుంచే ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. తొలి నుంచి పవన్‌కు అండగా నిలబడిన కాపు సంక్షేమ నేత చెగొండి హరిరామజోగయ్య ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేనకు వ్యతిరేకంగా మారారు. మరో కాపు నేత ముద్రగడ పద్మనాభం ముందు నుంచే జనసేనకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే జనాలు మాత్రం పవన్‌నే నమ్మారు. ఇటు పవన్ కూడా తనపై కులముద్ర పడకుండా జాగ్రత్తపడ్డారు. అన్ని కులాలవారితోనే కలిసి అడుగులు వేశారు. ఇది టీడీపీకి ఎంతగానో ప్లస్ అయ్యింది. ఈ ఈక్వేషన్స్ అన్నిటిని క్యాలిక్యూలేట్ చేస్తే ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ కచ్చితంగా పవన్ అనే చెప్పాల్సి ఉంటుంది.
Also Read: పవన్ కల్యాణ్ అభిమానులకు షాక్.. ఇక సినిమాలకు దూరం!