కొన్నిరోజులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకరించాయి. సాగర్ నుంచి ఏపీకి నీటిని విడుదల చేయడం, పోలీసుల బలగాలు మోహరించడం లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆన్‌లైన్‌లో సమీక్ష చేశారు. నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో వివాదం తలెత్తగా దీనిపై భల్లా సమీక్ష జరిపారు.
Also Read: రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్.. ఆ తర్వాతే ఫలితాల ప్రకటన..!!
గతనెల 28వ తేదికి ఉన్నటువంటి పరిస్థితినే కొనసాగించాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. డ్యాం నిర్వహణ తాత్కాలికంగా సీఆర్‌పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని సూచనలు చేశారు. అలాగే కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కేంద్రం.. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌లు, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్లకు లేఖ పంపింది. నాగార్జునసాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలు.. అలాగే వాటి పరిధిలో ఉన్న ఇతర నిర్మాణాలన్నింటినీ కృష్ణా బోర్డుకు బదిలీచేసే విషయాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నాగార్జునసాగర్ డ్యామ్ వ్యవహారం ఈరోజు కొలిక్కి వస్తుందా లేదా అనేది చూడాలి.
Also read: తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్‌పై ఏపీలో జోరుగా బెట్టింగ్స్..