IND vs ENG : ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) అదరగొట్టేశాడు. ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్న ఈ యంగ్ ప్లేయర్ వరుస డబుల్(Double century) సెంచరీతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 214 : 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో రికార్డ్ ద్విశతకం బాదేశాడు. టెస్ట్ కెరీర్‌లో ఆడిన 7 టెస్టుల్లోనే జైస్వాల్ రెండు సార్లు డబుల్ సెంచరీ చేయడం విశేషం. కాగా టెస్టు క్రికెట్‌లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
Also Read : మూడో టెస్ట్ నుంచి వైదొలగిన అశ్విన్.. కారణం ఇదే..
వన్డే తరహాలో బ్యాటింగ్..
ఓవర్‌నైట్ స్కోర్ 196/2తో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్(India) కు శుభ్‌మన్ గిల్(Shubman Gill), కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) లు మంచి శుభారంభాన్నిచ్చారు. అయితే సెంచరీ కొడతాడనుకున్న శుభ్‌మన్ 91 పరుగుల వద్ద అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అనంతరం మూడో రోజు ఆటలో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లిన యశస్వీ జైస్వాల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ఆ కాసేపటికే 27 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్‌ను రెహాన్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 258 పరుగులకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం జత కట్టిన యువ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వన్డే తరహాలో ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశారు. సర్ఫరాజ్ ఖాన్ (68*) వరుస హాఫ్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు.
భారీ లక్ష్యం..
ఇక భారత్ రెండో ఇన్నింగ్స్ 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేయగా.. ఇంగ్లాండ్(England) ఎదుట 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 319 రన్స్‌కే ఆలౌటైంది. భారత్‌కు 126 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.