Ganesh Immersion : దేశవ్యాప్తంగా వినాకయ నవరాత్రి వేడుకలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. అయితే గణేష్ నిమజ్జనం వేళ కొన్ని ప్రాంతాల్లో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. ఊహించని ప్రమాదాలు కొన్ని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పరిధిలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం కిర్లంపూడి మండలం పాలెం ఏలేరు కాలువలో గణేశుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో వీరవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలవలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగంపేట సీఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్సై సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగ్గంపేట సీఐ లక్ష్మణరావు తెలిపారు.