/rtv/media/media_files/2025/08/10/tight-security-in-pulivendula-2025-08-10-16-04-50.jpg)
Tight Security in Pulivendula
Pulivendula: ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట జడ్‌పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా పోలింగ్ కోసం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రెండు ప్రాంతాల్లో 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. సమస్యాత్మక పులివెందులపై మరింత నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇక్కడి జడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నీ అత్యంత సమస్యాత్మకమని పేర్కొన్నారు. ఈ కేంద్రాల వద్ద ఆర్మ్‌డ్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.
పులివెందుల జడ్‌పీటీసీ ఉప ఎన్నిక కు 550 మంది పోలీసులు, 4 ఏపీ ఎస్పీ ప్లటూన్లు, ఏ ఆర్ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఒంటిమిట్ట ఉప ఎన్నికకు 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.పులివెందుల నియోజక వర్గంలో ఇప్పటికే 500 మందికి పైగా రౌడీషీటర్లను బైండోవర్ చేశాం. ఒంటిమిట్ట మండలంలో 650 మందికి పై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు.అనుమానిత వ్యక్తులను పోలింగ్ రోజున గృహనిర్బంధం చేస్తాం. మీడియాపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచుతాం. సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వదిలిపెట్టం. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత 2 మండలాల్లో స్థానికేతరులు ఉండకూడదు’’ అని ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌తో కలసి ఎస్పీ అశోక్ కుమార్‌పరిశీలించారు. ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో నిర్వహించనున్న జెడ్పిటిసీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ మేరకు పులివెందుల, ఒంటిమిట్ట మండలాల పరిధిలో సమస్యాత్మకంగా గుర్తించిన పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, ఆర్వో ఓబులమ్మ లతో కలిసి పరిశీలించారు.ముందుగా పులివెందుల మండలంలోని కనంపల్లె(ఎంపిపి స్కూల్), మొట్నూతల (ఎంపిపి స్కూల్), ఇ-కొత్తపల్లె (ఆదర్శ పాఠశాల), నల్లపురెడ్డి పల్లె (జెడ్పి హైస్కూల్), నల్లగొండువారిపల్లె (ఎంపీపీ స్కూల్) పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, ఏఆర్వో వెంకటపతి, డిఎస్పీ మురళి, తహశీల్దార్లు, ఎంపిడివోలు సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఆ తర్వాత ఒంటిమిట్ట మండలంలోని కొత్తమాధవరం (జెడ్పి హైస్కూల్) పోలింగ్ కేంద్రాన్ని, ఒంటిమిట్ట గ్రామంలో (జెడ్పి హైస్కూల్), మంటపంపల్లె (ఎంపీపీ స్కూల్) పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, ఏఆర్వో రంగస్వామి, డిఎస్పీ వెంకటేశ్వర్లు, తహశీల్దార్లు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న జడ్‌పీటీసీ ఎన్నికల పోలింగ్ ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. రెండు మండలాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా సద్వినియోగం చేసుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు.
ఇది కూడా చూడండి: IAF: ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూల్చేశాం.. IAF చీఫ్ సంచలన వ్యాఖ్యలు