/rtv/media/media_files/2025/12/23/fotojet-19-2025-12-23-07-05-35.jpg)
Sri Govindaraja Swamy Temple
Tirupati: వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. కాగా తిరుమల వెంకన్న సన్నిధిలో జరిగిన లడ్డూ కల్తీనెయ్యి, పరకామణి చోరీ వంటి విషయాలపై విచారణ జరుపుతున్న విజిలెన్స్ అధికారులు బంగారం తాపడం విషయంలోనూ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. తిరుమల కొండతో పాటు కొండ కిందా కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయని విజిలెన్స్ అధికారులు అంటున్నారు. ఒక వైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగానే.. తాజాగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లోనూ అవినీతి జరిగిందని అనుమానిస్తున్నారు. విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ చేపట్టింది. అంతేకాక సుమారు 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
అత్యంత ప్రాముఖ్యం కలిగిన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు జరిగాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2022-23 మధ్యకాలంలో బంగారు తాపడం పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వంద కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా తొమ్మిది పొరల (9 లేయర్లు)తో గోపురానికి తాపడం చేయాల్సి ఉండగా, రెండు పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విమాన గోపురంపై ఉన్న 30 విగ్రహాలు ధ్వంసం చేసి, ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి కప్పిపుచ్చినట్లు ఆరోపలు వస్తున్నాయి. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్‌ను కాదని సబ్ లీజు కింద మరో ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు దేవస్థాన అధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్‌అధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు? బంగారం ఎంత వాడారు? అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
Follow Us