/rtv/media/media_files/2025/07/01/two-terrorists-arrested-in-annamayya-district-2025-07-01-20-42-58.jpg)
Two Terrorists Arrested in Annamayya district
ఏపీలో మరోసారి ఉగ్రమూకల కలకలం రేగింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. వారిని అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపలయం)గా గుర్తించారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు అనేక పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందిన సమాచారం మేరకు వీరిని అత్యంత రహస్యంగా తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో టెర్రరిస్టుల కలకలం
స్థానిక పోలీసుల సహకారంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపలయం) లను అదుపులోకి తీసుకుని తమిళనాడు తరలించారు. కాగా ఈ ఇద్దరు ఉగ్రవాదులు చాలా కాలంగా రాయచోటిలో రహస్యంగా తలదాచుకున్నట్లు సమాచారం. అబూబక్కర్ సిద్దీక్క్, మొహమ్మద్ అలీ టెర్రరిస్టులు అనేక ఉగ్రవాద కేసుల్లో 30 ఏళ్లుగా పరారీలో ఉన్నారు.
చివరికి వీరిని అత్యంత పగడ్బందీగా అరెస్టు చేసిన పోలీసులు తమిళనాడు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వీరిద్దరిలో అబూబక్కర్ సిద్దీక్ 1995 నుండి పరారీలో ఉన్నాడు. 1995లో చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు.. అలాగే 1995లో నాగూరులో పార్శిల్ బాంబు పేలుడు (తంగం మరణం).. ఇంకా 1999లో చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా చేసుకుని చెన్నై, కోయంబత్తూరు, కేరళ, తిరుచ్చిలో 7 చోట్ల బాంబు పెట్టడంలో అబూబక్కర్ సిద్దీక్ నిందితుడుగా ఉన్నాడు.
ఇవి మాత్రమే కాకుండా.. 2011లో మధురైలో ఎల్.కె.అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబు.. అలాగే 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య.. అనంతరం 2013లో బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో అబూబక్కర్ సిద్దీక్ నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు మొహమ్మద్ అలీ 26 ఏళ్లుగా పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడు 1999లో తమిళనాడు, కేరళలో బాంబు ఘటనల్లో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.