Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత

రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లోనూ నిలిపివేయాలని నిర్ణయించింది.

New Update
Tirumala Tirupati Devasthanams .

Tirumala Tirupati Devasthanams .

Tirumala: రథ సప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లోనూ నిలిపివేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ప్రకటించింది. ఇదిలా ఉండగా ఆదివారం రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించాలని  టీటీడీ అధికారులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పటికే ఆదేశించారు.

 రథ సప్తమి నేపథ్యంలో ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాలు, లడ్డూలు, రద్దీ నిర్వహణ, స్వచ్ఛ కార్యక్రమాలు, అత్యవసర సేవల విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారికి ఆయన సూచించారు. సందర్శకులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, గ్యాలరీల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

రథసప్తమి వేళ.. ఏఏ సేవలు..ఎప్పుడెప్పుడంటే...
తెల్లవారుజామున 5:30 నుంచి 8:00 గంటల వరకు సూర్యప్రభ వాహనం
ఉదయం 9:00 నుంచి 10:00 గంటల వరకు చిన్నశేష వాహనం
ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు గరుడ వాహనం
మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 గంటల వరకు హనుమంత వాహనం
మధ్యాహ్నం 2:00 నుంచి 3:00 గంటల వరకు చక్రస్నానం
సాయంత్రం 4:00 నుంచి 5:00 గంటల వరకు కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6:00 నుంచి 7:00 గంటల వరకు సర్వభూపాల వాహనం
రాత్రి 8:00 నుంచి 9:00 గంటల వరకు చంద్రప్రభ వాహనం

ఆ లేఖలు చెల్లవు

రథ సప్తమిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన  నేపథ్యంలో స్వామివారి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపకాలంకార సేవలు అన్ని కూడా రద్దు చేశారు. ఎన్‌ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ప్రివిలేజ్ దర్శనాలూ కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేయడం సహా బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలనూ స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేయడం గమనార్హం.

నేడు ఏప్రిల్ నెల టికెట్లు విడుదల

ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఈ రోజు ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉదయం 10:00 గంటలకు ఆర్జిత సేవ, మధ్యాహ్నం 3:00 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 10:00 గంటలకు అంగ ప్రదక్షణ టోకెన్లు, 11:00 గంటలకు శ్రీవాణి టికెట్స్ కోటా విడుదల చేస్తారు.. అలాగే మధ్యాహ్నం 3:00 గంటలకు వికలాంగులు, వృద్ధుల టోకెన్స్ విడుదల చేస్తారు. శనివారం ఉదయం 10: 00 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు