Tirupati Laddu : తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు అధికారులను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒకరితో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సూచించింది.
కేంద్ర అధికారి పర్యవేక్షణ..
టీటీడీ తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. సుబ్రమణ్య స్వామి కోర్టుకు స్వయంగా తన వాదనలు వినిపించారు. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. వైవీ సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవన్నారు. అయితే ఈ అంశంలో కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని తన అభిప్రాయం వెల్లడించారు. ఆధారాలు లేకుండానే లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించారు. వివాదం కోర్టులో ఉండగానే పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మీడియాకు ఎందుకు చెప్పారు..
ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 30న ఈ కేసు విచారించిన ధర్మాసనం.. సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలా అనే విషయంలో తమకు సహకరించాలని మెహతాను కోరింది. నెయ్యి కల్తీపై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా సీఎం వ్యవహరించారని వ్యాఖ్యానించింది. కల్తీపై వాస్తవాల నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టం చేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని, జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్‌లో మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. దీనివల్ల కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పింది.
Also Read : నవరాత్రుల స్పెషల్...భక్తుల కోసం ప్రత్యేక యాప్!