/rtv/media/media_files/2026/01/06/fotojet-91-2026-01-06-20-27-23.jpg)
ONGC gas drilling Blowout
Paschrlapudi Blow Out: కోనసీమ అంటే ప్రకృతి అందాలు..పండుగలు..రకరకాల వంటకాలు మాత్రమే గుర్తుకు వచ్చే ప్రాంతం. అలాంటిది అక్కడ జరిగిన ఘటన దేశం యావత్తు కోనసీమ వైపు భయంతో చూసేలా చేసింది. అదే ONGC గ్యాస్ లీక్ వల్ల ఏర్పడిన పాశర్లపూడి బ్లో ఔట్. ఈ సంఘటన కోనసీమ పేరును దేశ వ్యాప్తంగా గుర్తుండిపోయేలా చేసింది. మరో భోపాల్ దుర్ఘటనలా మిగిలిపోతుందా అని పరిశీలకులను, అధికారులను భయం వెంటాడింది. పాశర్లపూడి బ్లో ఔట్ ఘటన కు 30 ఏళ్ళు పూర్తయ్యాయి.
ఇరుసమండ ను మించి...
కాగా అలాంటి ఘటనే ప్రస్తుతం కోనసీమ జిల్లాలో మలికిపురం మండలంలోని ఇరుసమండ గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఈసారి కూడా ONGC గ్యాస్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి. అయితే దీన్ని మించిన అత్యంత ప్రమాదం 30 ఏళ్ల క్రితమే జరిగింది. అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాశర్లపూడి అనే గ్రామంలో ONGC గ్యాస్ డ్రిల్లింగ్ పనులు జరుపుతుండగా ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ ఏర్పడి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ సంక్రాంతి పండుగకు రెడీ అవుతున్న సమయంలో 8 జనవరి 1995 సాయంత్రం 6:50కి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.
ONGC 19వ నెంబర్ బావి వద్ద జరిగిన బ్లో ఔట్‌తో మొదలైన అగ్ని జ్వాలలు ఏకంగా 65రోజులపాటు కొనసాగాయి. చివరికి మార్చి 15 నాటికి అదుపులోకి వచ్చాయి. అన్ని రోజులపాటు అగ్ని జ్వాలలు అలా ఎగసిపడుతుండడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దేశం యావత్తు భయపడింది. ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయి చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించింది. ఏదో రెండు మూడు రోజుల్లో మళ్ళీ సొంత ఊరికి వచ్చేస్తామనుకున్న ప్రజలు ఏకంగా రెండు నెలల పాటు తమ ఊళ్లకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు కానీ ప్రమాదం సంభవించిన రిగ్ నెంబర్ 19 మొత్తం నాశనం అయిపోయింది. ఆ రోజుల్లోనే దాని విలువ 9.2 కోట్లుగా అంచనా వేశారు. అది కాకుండా చుట్టుప్రక్కల ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయింది. వాటి విలువ మరో 7కోట్లుగా తేల్చారు.
ఫలించని ఇంజనీర్ల ప్రయత్నం
కాగా మంటలను అదుపు చేయడానికి ఎంత ట్రై చేసినా అదుపులోకి రాకపోవడంతో అమెరికాలోని హుస్టన్‌కు చెందిన నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటర్స్ సంస్థ కు చెందిన ఇంజనీర్లను రప్పించారు. కానీ వారు చేసిన మొదటి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తరువాత మంటలను అదుపు చేయడానికి వారు మరో పథకం వేసినా అది మరింత ప్రమాదమంటూ దానికి ONGC అనుమతి ఇవ్వలేదు. చివరకు ఇంటర్‌నేషనల్ వెల్ కంట్రోల్ సంస్థ ఇంజనీర్లు రంగంలోకి దిగి 15 మార్చ్ 1995న మంటలను అదుపులోనికి తీసుకువచ్చింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లో ఔట్‌గా చరిత్రకెక్కింది. ఏకంగా 200మీటర్ల ఎత్తుకు మంటలు ఎగసిపడటం గమనార్హం.
కాగా అప్పట్లో బ్లో ఔట్ కారణంగా ఎగడిపడుతున్న మంటలు చాలా కిలోమీటర్ల దూరానికి కనపడేవి. వాటిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కోనసీమ వచ్చేవారు. ప్రస్తుతం అంతా ఒకే అన్నట్టు కనపడుతున్నా 30 ఏళ్ల తర్వాత కూడా బ్లో ఔట్ అన్న మాట వినగానే భయంతో ఉలిక్కిపడుతుంటారు పాశర్లపూడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. తాజాగా మలికిపురం బ్లో ఔట్ ప్రమాదంతో ఆనాటి భయంకర పరిస్థితుల గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అప్పటి తరం వారు.
ఈసారి ఇరుసిమండలో..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసిమండలో జరిగిన గ్యాస్ బ్లో అవుట్ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అసలు సహజ వాయువు లేదా చమురు అన్వేషణలో ఇలాంటి బ్లో అవుట్ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? వాటిని అదుపు చేయడం ఎంత కష్టం? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బ్లో అవుట్ ఎందుకు జరుగుతుంది?
భూమి లోపల చమురు లేదా గ్యాస్ నిక్షేపాలు అత్యంత భారీ పీడనం వద్ద ఉంటాయి. డ్రిల్లింగ్ చేసినప్పుడు, ఆ పీడనాన్ని నియంత్రించడానికి ప్రత్యేకమైన డ్రిల్లింగ్ మడ్ అనే ద్రవాన్ని బావిలోకి పంపుతారు. ఈ ద్రవం బరువు లోపలి పీడనాన్ని అణచివేస్తుంది. అయితే, కొన్నిసార్లు భూగర్భంలో ఊహించని విధంగా పీడనం ఒక్కసారిగా పెరిగినప్పుడు లేదా డ్రిల్లింగ్ మడ్ బరువు తగ్గినప్పుడు.. లోపలి గ్యాస్, చమురు నియంత్రణ తప్పి అత్యంత వేగంతో పైకి తన్నుకొస్తాయి. దీనినే కిక్ అంటారు. ఈ కిక్ ను నియంత్రించలేకపోతే అది బ్లో అవుట్ గా మారుతుందని నిపుణులు అంటున్నారు.
నియంత్రించడం కష్టమే..
సాధారణంగా ఇలాంటి ప్రమాదాలను ఆపడానికి బావి ముఖద్వారం వద్ద బ్లో అవుట్ ప్రివెంటర్ అనే భారీ యంత్రాన్ని అమర్చుతారు. ఇది ఒక రకమైన సేఫ్టీ వాల్వ్ లాంటిది. లోపలి నుంచి పీడనం పెరిగినప్పుడు ఇది బావిని గట్టిగా మూసేస్తుంది. అయితే, ఇరుసుమండ వంటి ఘటనల్లో.. మరమ్మతులు చేస్తున్నప్పుడు లేదా యంత్రం పాతదైనప్పుడు ఈ బి.ఓ.పి సరిగ్గా పనిచేయదు. దీంతో గ్యాస్‌తో పాటు రాళ్లు, ఇసుక వంటివి రావడం వల్ల వాల్వ్‌లు దెబ్బతిని గ్యాస్ బయటకు లీక్ అవుతుంది. ఒకసారి బ్లో అవుట్ జరిగి మంటలు అంటుకున్నాక, వాటిని ఆర్పడం చాలా కష్టం.
బావి నుంచి గ్యాస్ నిరంతరం అత్యంత వేగంతో బయటకు వస్తుంటుంది. దీంతో నీళ్లు చల్లినా ఆ వేగానికి అవి ఆవిరైపోతాయి. మంటల వల్ల బావి చుట్టూ ఉన్న పరికరాలు, ఇనుప రిగ్గులు కరిగిపోయి ఒక ముద్దలా తయారవుతాయి. వీటిని తొలగించకుండా బావి ముఖద్వారాన్ని మూయడం అసాధ్యం. మంటలు ఆర్పే క్రమంలో గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది. అది మళ్ళీ పేలిపోయే అవకాశం ఉన్నందున నిపుణులు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు దాన్ని ఇపడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో డైనమిక్ కిల్లర్ అనే పద్ధతిని వాడతారు. అంటే మంటలు ఎగసిపడుతున్న బావిలోకి అత్యధిక పీడనంతో భారీ మొత్తంలో డ్రిల్లింగ్ మడ్ లేదా సిమెంట్‌ను పంపి లోపలి గ్యాస్‌ను అణచివేయడం. కొన్నిసార్లు ప్రమాదం జరిగిన బావికి కొద్ది దూరంలో మరో బావిని తవ్వి, భూగర్భంలోనే ఆ గ్యాస్ ప్రవాహాన్ని మళ్లించి అసలు బావిని మూసేయడం చేస్తారు. అయితే ఇది ఒక్కరోజులో సాధ్యపడదు రోజుల నుండి వారాల సమయం పట్టే అవకాశం ఉంటుంది.
మానవ తప్పిదమే...
ఇలాంటి ప్రమాదాలకు కారణం మానవతప్పిదమే అంటున్నారు నిపుణలు. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు బావి లోపల పీడనంలో వచ్చే చిన్న మార్పులను కూడా గుర్తించే సెన్సార్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి. బ్లో అవుట్ ప్రివెంటర్ (BOP) యంత్రాలను కాలానుగుణంగా పరీక్షిస్తూ ఉండాలి, నాణ్యమైన పరికరాలనే వాడాలి. డ్రిల్లింగ్ మడ్ సాంద్రతను ఎప్పటికప్పుడు లెక్కిస్తూ, భూగర్భ పీడనాన్ని తట్టుకునేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సెకన్ల వ్యవధిలో ఎలా స్పందించాలో సిబ్బందికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వాలి. కానీ ఇసురుమండ బ్లోఅవుట్ సమయంలో మానవ తప్పిదం జరిగినట్లుగా నిపుణలు భావిస్తున్నారు.
Follow Us