/rtv/media/media_files/2026/01/31/fotojet-97-2026-01-31-19-27-05.jpg)
Tension in Guntur....attack on Ambati's house
Guntur:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటి (ఆఫీస్)ని ముట్టడించారు. అంబటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకుని వెంటనే ముఖ్యమంత్రికి అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో భారీగా టీడీపీ మహిళా కార్యకర్తలు అంబటి ఇంటికి తరలివచ్చారు. కొందరు కార్యకర్తలు అంబటి ఇంటిపైకి రాళ్లు రువ్బడంతో పాటు అక్కడ ఉన్న కారును ధ్వంసం చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి, కారును ధ్వంసం చేశారు. అంబటి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తెదేపా నేతలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అంబటి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంబటి రాంబాబుపై కేసు నమోదు
సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తెదేపా నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు అంబటి ఇంటికి వైసీపీ శ్రేణులు చేరుకోవడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
నన్ను తిట్టిన వారినే.. నేనూ తిట్టిన
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై అంబటి రాంబాబు స్పందించారు. తాను చంద్రబాబును తిట్టలేదన్న ఆయన తనను అడ్డగించి, తిడుతున్నవారిని మాత్రమే తను తిట్టానని అన్నారు. మనిషిగా వాళ్లు తిడుతుంటే తానూ తిట్టానన్న అంబటి రాంబాబు.. ఈ వయసులో అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. మరోవైపు చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు.
వైసీపీ ఖండన
గుంటూరు శివారులోని గోరంట్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జంగిల్‌రాజ్ కొనసాగుతోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంపైనా, నాటి సీఎం వైఎస్ జగన్‌పైనా అసత్య ఆరోపణలు చేస్తూ, చివరకు దేవదేవుడి ప్రసాదం పేరుతో అనైతిక రాజకీయం చేశారని వారు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ తేల్చి చెప్పాయని అన్నారు. దీంతో దిక్కు తోచని స్థితిలో, కనీసం పశ్చాతాపం కూడా ప్రకటించకుండా, మళ్లీ అవే అసత్యాలతో ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు.
Follow Us