/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t205733-2026-01-20-20-58-11.jpg)
Female Constable Jayashanti
Female Constable Jayashanti : చేతిలో చంటి బిడ్డ ఉన్నా తన కర్తవ్యాన్ని మరవని మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డను భుజాన వేసుకుని కాకినాడలో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాకినాడ కెనాల్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, సుమారుగా ఐదారు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయి.. రాకపోకలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్ జామ్‌లో రెండు అంబులెన్సులు చిక్కుకుపోయాయి. అలాగే పురిటి నొప్పులు పడుతున్న ఓ గర్భిణి కూడా ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. దీంతో జయశాంతి తాను విధుల్లో లేకున్నా చంకన బిడ్డతో అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీనిని కొందరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కాగా నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
పోలీసుల గౌరవాన్ని పెంచిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారి నిబద్ధత అందరిలో స్ఫూర్తి నింపింది. విధుల్లో లేకపోయినా సమాజం పట్ల బాధ్యతతో చేతిలో చంటిబిడ్డతో అంబులెన్స్ కు దారి ఇవ్వడం కోసం ట్రాఫిక్ క్లియర్ చేసిన రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారికి ఫోన్ చేసి అభినందించడం జరిగింది.… pic.twitter.com/VzyNL4eRbj
— Anitha Vangalapudi (@Anitha_TDP) January 20, 2026
ఇంతకీ ఏం జరిగిందంటే ?
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ లో ఆమదాల జయశాంతి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త సైతం గుంటూరు ప్రాంతంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు, అయితే ఈ కానిస్టేబుల్ దంపతులకు జన్మించిన బిడ్డ చిన్నవాడు కావడంతో ఇంటి దగ్గరే ఆయాను ఏర్పాటు చేసి ఎవరి ఉద్యోగాలకు వారు వెళ్లి తిరిగి మరలా ఇంటికి వస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో పండుగ సెలవులు నేపథ్యంలో ఆయా సెలవు పెట్టడంతో డ్యూటీకి మహిళా కానిస్టేబుల్ అయిన ఆమదాల జయశాంతి వెళ్లేటప్పుడే తనబిడ్డను తీసుకుని రంగంపేట పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు, ఆ రోజంతా విధులకు హాజరై తిరిగి మరల సాయంత్రం వారు ఉంటున్న కాకినాడకు రంగంపేట పోలీస్ స్టేషన్ నుంచి బిడ్డతో కలిసి ప్రయాణమయ్యారు. సరిగ్గా సామర్లకోట ఏడిబి రోడ్డుకు వచ్చేసరికి భారీ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సమయం గడుస్తుంది ట్రాఫిక్ క్లియర్ కాని పరిస్థితి నెలకొంది, అదే సమయంలో అంబులెన్స్ సైతం ఆ ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించింది. ఇలాంటి తరుణంలో మహిళా కానిస్టేబుల్ బిడ్డను చంకన పెట్టుకుని రోడ్ ఎక్కారు. కటికచీకటి అయినప్పటికీ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో నిబద్ధతతో పనిచేశారు. చాలా దూరం ట్రాఫిక్ సమస్య ఉన్న నేపథ్యంలో కేవలం 15 నిమిషాల్లో రూటు క్లియర్ చేశారు. దీంతో ఆమెకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్ అమ్మా..
మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రశంసలు కురిపించారు. చంకలో చంటిబిడ్డను పెట్టుకుని.. డ్యూటీలో లేకపోయినా కూడా అంబులెన్స్ కోసం ట్రాఫిక్ క్లియర్ చేసిన ఆమెను అభినందించారు. మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్ అమ్మా అంటూ ట్వీట్ చేశారు. ఓ చేతిలో పేగుబంధం.. మరో చేతిలో సమాజ బాధ్యత.. మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆమెకు పురస్కారం అందించండి..
జయశాంతి చొరవను గుర్తించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో ఆమెను ట్యాగ్ చేసి అభినందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమెకు పురస్కారం అందించాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కు సూచించారు. ఇలాంటి ఘటనలు పోలీసుల నిబద్దతను సూచిస్తాయని, ప్రజల్లో వారి పట్ల మరింత నమ్మకం కలిగిస్తాయని స్పష్టం చేశారు.
పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా చేసింది..
కానిస్టేబుల్ జయశాంతికి హోం మంత్రి అనిత ఫోన్ చేసి మాట్లాడారు. ఈ రోజు పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని మంత్రి అనిత అన్నారు. ఆమె కుటుంబం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ జయశాంతి హోం మంత్రిని కలిసేందుకు ఆసక్తి చూపించగా.. త్వరలోనే కలుద్దామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. విధుల్లో లేకపోయినా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారని.. సోషల్ మీడియా వేదికగా జయశాంతిని అభినందించిన వారందరికీ పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Follow Us