Tirupati: ఏపీ మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. తిరుమలలో ఆంక్షలు విధిస్తున్నట్లు తిరుపతి ఎస్సీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనసరిగా తీసుకోవాలని సూచించారు. అలాగే నెల రోజుల పాటు తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండనున్నట్లు వెల్లడించారు. జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు వైఎస్ జగన్ తిరుమల దర్శనానికి వెళ్లనున్నారు.
పోలీస్ యాక్ట్ 30 అమలు..
ఈ మేరకు 'శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 25-09-2024వ తేదీ నుంచి 24-10-2024వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుంది. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఇప్పటికే ఏపీలో లడ్డూ వివాదం కొనసాగుతుండగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కూటమి ఆరోపణలకు కౌంటర్‌గా జగన్ తిరుమల టూర్ వెళ్లనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ముందు జాగ్రత్తగా ఆంక్షలను అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.