/rtv/media/media_files/2026/01/09/fotojet-13-2026-01-09-19-12-56.jpg)
Pawan Kalyan's visit to Pithapuram
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం అయిన పిఠాపురంలో ఈ రోజు పర్యటించారు. సంక్రాంతి పండుగ దగ్గరకు రావడంతో నియోజకవర్గంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో కాలినడకన ప్రజల వద్దకు వెళ్లి, వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పిఠాపురం ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి
ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానం నుంచి పవన్ కళ్యాణ్ వెలుపలికి రాగానే పలువురు ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు నిల్చుని ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకునేందుకు వాహన శ్రేణి నుంచి దిగిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయం వరకు ప్రజల్ని పలుకరిస్తూ కాలినడకన ముందుకు సాగారు. శ్రీమతి పెద్దింటి అనంత పద్మావతి అనే మహిళ తమకు ఇంటి స్థలం కావాలని కోరారు. మరో మహిళ తమ ఇళ్ల వద్ద విద్యుత్ తీగలు సాగిపోయి కిందికి వచ్చేసి ప్రమాదకరంగా ఉన్నాయని, సాగిపోయిన విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను తక్షణం పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
పిఠాపురం పోలీస్ స్టేషన్ పరిశీలన
అనంతరం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్టేషన్లో ఉన్న గదులను చూసి పిఠాపురంలో శాంతి భద్రతల తీరుపై ఆరా తీశారు. స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఫొటోలు దిగారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి కుక్కుటేశ్వరస్వామి ఆలయ సమీపంలో యానాదుల కాలనీవాసులను పలుకరించారు. శ్రీ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి యానాదుల కాలనీలో పక్కా ఇళ్లు నిర్మించాలని, డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని పవన్ కళ్యాణ్ కు చెప్పుకున్నారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం వెలుపల ఉన్న దుకాణదారులను పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చివరిగా ఆలయ అర్చకులతో మాట్లాడి వారితో ఫొటోలు దిగారు.
రూ.211 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతితోపాటు అభివృద్ధి పండుగను తీసుకువచ్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో పాల్గొన్న ఆయన రూ. 211 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పిఠాపురం మండల పరిధిలో రూ.9.60 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ , కోనపాపపేటలో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్, ఉపాధి హామీ పథకం, ఆర్ అండ్ బి నిధులు, సాస్కీ నిధులతో నిర్మించనున్న రోడ్లు, గోకులాలు, వివిధ అభివృద్ధి పనులు వీటిలో ఉన్నాయి.
అధికారులపై ఆగ్రహం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పిఠాపురం పట్టణం ఇందిరానగర్ లో పర్యటించారు. ఇందిరానగర్ లో ముంపు ప్రాంతాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..స్వయంగా నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, జనసేన నాయకులు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నిధులు ఇస్తున్న పనులు ఎందుకు చేయడం లేదు, ప్రజల సౌకర్యాలు అందించకపోతే మనం ఎందుకు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మీరు జీతాలు తీసుకుంటూ ఎందుకు పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
Follow Us