ఈ మధ్య ఆన్లైన్ బెట్టింగ్లు అధికమైపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకే ఒక్క జాక్ పాట్ తో ధనవంతులైపోవాలనుకుంటున్నారు. కానీ ఆ ఆశ కాస్త బెడిసికొట్టడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో దాదాపు రూ.30 లక్షలు కోల్పోడంతో చిత్తూరు జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
రూ.30 లక్షలు అప్పులు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి ఆన్ లైన్ బెట్టింగులకు బాగా అలవాటు పడ్డాడు. అతడి వద్ద ఉన్న డబ్బులే కాకుండా అక్కడా ఇక్కడా అప్పులు చేశాడు. అలా దాదాపు రూ.30 లక్షలు అప్పులు చేసిన డబ్బుతో బెట్టింగ్ ఆడాడు. అది కాస్త బెడిసికొట్టడంతో రూ.30 లక్షలు కోల్పోయాడు. దీంతో ఒక్కరూపాయి కూడా తిరిగి రాకపోవడంతో మనస్థాపం చెందారు.
ఇది కూడా చదవండిః భార్యపై 92 రేప్ లు చేయించిన భర్త కేసు.. కోర్టు కీలక నిర్ణయం
అప్పుల భయం పట్టుకుంది. ఆ క్షణకావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం అతడి భార్య జయంతి 45, కుమార్తె సునీత26, కుమారుడు దినేష్ 22 నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. పురుగుల మందు సేవించిన కొద్దిసేపటికి కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో గట్టిగా అరుపులు అరిచారు. అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణంగా బెట్టింగ్ యాప్ అని స్థానిక పోలీసులు తెలిపారు.
మరో ఘటన
నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు సురేశ్ (53), హేమలత (45), హరీశ్(22)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో వడ్డేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.