/rtv/media/media_files/2025/11/19/daughter-2025-11-19-09-09-16.jpg)
అమ్మ ప్రేమ కంచె దాటలేని బంధం. కానీ ఆ తల్లి చూపిన ప్రేమ, భయం హద్దులు దాటి ఒక జీవితాన్ని రెండేళ్లు చీకట్లోకి నెట్టింది. ఎక్కడ కూతురిని చంపేస్తారోనన్న అంతులేని భయంతో ఓ తల్లి తన మైనర్ కూతురిని రెండేళ్లుగా ఇంటికే పరిమితం చేసి, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బంధించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని చక్రపాణి వీధిలో ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒడిశాలోని కటక్‌కు చెందిన నరసింహరాజుతో భాగ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. పదేళ్ల క్రితం భర్త మరణించడంతో, కుమార్తె మౌనికతో కలిసి భాగ్యలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఉంటుంది. కుమార్తె మౌనికను తొమ్మిదో తరగతితోనే చదువు మానిపించిన తల్లి భాగ్యలక్ష్మి, అప్పటినుంచి మౌనికను ఇంట్లోనే నిర్బంధించారు. ఎవరైనా బయటకు వెళ్తే తన కూతురిని చంపేస్తారేమో అన్న తీవ్ర భయంతో భాగ్యలక్ష్మి మౌనికను దాదాపు రెండేళ్లుగా ఇంటికే పరిమితం చేశారు. మౌనిక మైనర్ తీరిన తర్వాత కూడా చదువు ఆపేసి ఈ నిర్బంధాన్ని కొనసాగించారు.
రాత్రంతా చీకట్లోనే నివాసం
వీరిద్దరూ చీకటి పడితే కరెంటు ఆపేసి, రాత్రంతా చీకట్లోనే నివాసం ఉండేవారు. భాగ్యలక్ష్మి బయటకు నిత్యావసరాల కోసం వెళ్లాల్సి వస్తే, మౌనికను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లేవారు.తల్లీకూతుర్ల అసాధారణ జీవనం, ఇంట్లో నుంచి ఎప్పుడూ బయటకు రాకపోవడం వంటి విషయాలపై ఇరుగుపొరుగు వారు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఇంటిని పరిశీలించారు.
కూతురిపై అతి భయం, అసాధారణ ప్రవర్తన నేపథ్యంలో తల్లి భాగ్యలక్ష్మి మానసిక స్థితి బాగోలేదని అధికారులు గుర్తించారు. దీని వల్ల ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లుగా ఇంటికే పరిమితం కావడంతో, సరైన పోషకాహారం, బయటి గాలి తగలక మౌనిక ఆరోగ్యం బాగా క్షీణించింది. తల్లి భాగ్యలక్ష్మి ఆరోగ్యం కూడా విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను తక్షణమే విశాఖపట్నం KGH ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మౌనికను అధికారులు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
Follow Us