/rtv/media/media_files/2025/09/25/chiranjeevi-vs-balakrishna-2025-09-25-19-50-28.jpg)
ఏపీ అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్ ను సైకో అనడంతో పాటు చిరంజీవి పేరు ప్రస్తావించడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి గట్టిగా మాట్లాడితేనే సీఎం జగన్ వచ్చి నాడు సినీ ప్రముఖులను కలిశాడంటూ చేసిన కామినేని శ్రీనివాస్ చెప్పిన విషయాలను అసెంబ్లీలో బాలకృష్ణ ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. 'చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలను తాను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశానన్నారు. ఈ అంశంలో తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ప్రజలకు వివరణ ఇస్తున్నానన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తన వద్దకు వచ్చారన్నారు.
సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అన్నారన్నారు. అందుకు తనను చొరవ తీసుకోవాలని కోరినట్లు వివరించారు. అప్పుడు తనను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీఆర్, డీవీవీ దానయ్య, మైత్రి మూవీస్ నిర్మాతలు ఉన్నట్లు చెప్పారు. వారి సూచనల మేరకు తాను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్ లో మాట్లాడానన్నారు. టికెట్ల ధరల విషయం మంత్రితో మాట్లాడి చెబుతానని ఆయన తనతో చెప్పారన్నారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి ఫోన్ చేసి సీఎం ముందు మీతో ఒన్ టూ ఒన్ కలుస్తానని చెప్పారన్నారు. లంచ్ కు రావాలని చెప్పారని ఓ తేదీ ఇచ్చినట్లు వివరించారు.
సీఎం ఆహ్వానం మేరకు తాను ఆయన నివాసానికి వెళ్లానన్నారు. ఈ క్రమంలో వారు తనను సాదరంగా ఆహ్వానించారన్నారు చిరంజీవి. లంచ్ చేస్తున్న సమయంలోనే తాను సినీ పరిశ్రమ ఇబ్బందులను వారికి వివరించినట్లు చెప్పారు. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని సీఎంకు చెప్పానన్నారు. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్నినాని తనకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ ఉన్న నేపథ్యంలో ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెబితే పది మందిమి వస్తామని తాను చెప్పానన్నారు.ఆ సమయంలో తాను బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించానన్నారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. ఈ నేపథ్యంలో తాను ఒక ఫ్లైట్ ఏర్పాటు కొంతమందితో వెళ్లి సీఎంను కలిశామన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని తాను కోరినట్లు చెప్పారు.
శ్రీ శ్రీ శ్రీ నందమూరి బాలకృష్ణ
— Ambati Rambabu (@AmbatiRambabu) September 25, 2025
ప్రపంచంలోనే అతి పెద్ద సైకో!
కావాలంటే సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తా !
అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమేనన్నారు. తాను ఆ రోజు ఆ రకమైన చొరవ తీసుకోవడం కారణంగానే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచడానికి అంగీకరించిందన్నారు. ఆ నిర్ణయంతోనే బాలకృష్ణ వీరసింహా రెడ్డి, తన వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ రేట్లు పెంచడానికి కారణం అయ్యిందన్నారు. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందని చెప్పారు చిరంజీవి. తాను సీఎంతోనైనా, సామాన్యుడితోనైనా తన సహజ సిద్ధమైన ధోరణిలో, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతానని స్పష్టం చేశారు చిరంజీవి. ప్రస్తుతం తాను దేశంలో లేను కాబట్టి పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నానన్నారు.
ఈ ప్రకటనతో ఇప్పుడు ఈ విషయం చిరంజీవి Vs బాలయ్యగా మారింది. వైసీపీ ఫ్యాన్స్ చిరంజీవి ప్రకటనను వైరల్ చేస్తున్నారు. ఆ రోజు జరిగింది ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జూపూడి ప్రభాకర్, గుడివాడ అమర్ నాథ్ తదితరులు ఇప్పటికే బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. నువ్వే పెద్ద సైకో అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం ఇంతటితో సమసిపోతుందా? లేదా మరింత తీవ్రం అవుతుందా? అన్న అంశంపై ఏపీ పాలిటిక్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.