Vijayawada: విజయవాడలో  మావోయిస్టు షెల్టర్‌ జోన్స్...పోలీసుల అదుపులో అగ్రనేత ?

మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా సహా ఆరుగురు ఎన్‌కౌంటర్ తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు విజయవాడలో పలువురు మావోయిస్టులు పట్టుబడ్డారు. వారంతా దేవ్ జీకి సెక్యూరిటీగా ఉండే వారని తెలుస్తోంది. దీంతో దేవ్ జీ ఎక్కడున్నారన్న సందేహం మొదలైంది.

New Update
FotoJet - 2025-11-19T085354.494

Top leader dev ji in police custody ?

Vijayawada: మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా సహా ఆరుగురు ఎన్‌కౌంటర్ తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదిలా ఉండగానే  ఏపీ లోని పలు చోట్ల పోలీసులు మెరుపు దాడులు చేశారు. విజయవాడ పెనుమలూరు, ఏలూరు. కాకినాడ తదితర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్..ఆక్టోపస్ పోలీసులు బృందాలుగా వెళ్లి చుట్టుముట్టి సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో  విజయవాడ పెనుమలూరులోని అద్దె భవనంలో 27 మంది సహా మొత్తం 31 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు..వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు.  వారిలో ఎక్కువమంది ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు. పట్టుబడిన వారిలో కీలక నేతలు ఉన్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. వీరంతా బడా లీడర్స్ కు రక్షణగా ఉండే ఆర్మీ టీం సభ్యులని కూడా అధికారులు తెలిపారు. వారంతా దేవ్ జీకి సెక్యూరిటీగా ఉండే మావోయిస్టులని తెలుస్తోంది. దీంతో దేవ్ జీ ఎక్కడున్నారన్న సందేహం ప్రారంభమయింది.  

ఈ క్రమంలో పట్టుబడిన కీలక నేతలలో దేవ్ జీ కూడా ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు మాత్రం పట్టుబడిన కీలకనేతల పేర్లు ఇంతవరకు వెల్లడించలేదు. దేవ్ జీ కి సంబంధించిన ప్రచారాన్ని కూడా కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉండగా పౌర హక్కుల సంఘం నాయకులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దేవ్ జీ అరెస్ట్ పై.. ఆంధ్రా తెలంగాణ ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది..          

  ఎవరీ దేవ్‌ జీ?

 తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (60) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)లో అత్యంత కీలక నాయకుడు. 2025 మేలో చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో పార్టీ ప్రధానకార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయిన తర్వాత ఆ  స్థానంలో సెప్టెంబర్ 2025లో దేవ్‌జీని కేంద్ర కమిటీ ఎంపిక చేసింది.  మావోయిస్టు పాలిట్‌బ్యూరో మెంబర్‌గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ఈయన  గెరిల్లా యుద్ధ నిపుణుడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)ను సృష్టించడంలో దేవ్‌జీ కీలక పాత్ర పోషించాడు.  మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు రిక్రూట్‌మెంట్, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో ఈయన ప్రధాన పాత్ర ఉంది.        
 
తిప్పిరి తిరుపతి  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా  కొరుట్లకు చెందిన వారు.  ఇంటర్మీడియట్‌ను కొరుట్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. 1983లో కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో డిగ్రీ చేరిన తర్వాత, ఆర్‌ఎస్‌యూ,-ఎబీవీపీ మధ్య ఘర్షణల్లో పాల్గొని పలు పోలీస్ కేసుల్లో చిక్కుకున్నాడు. దీంతో1983 నాటికి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఉద్యమంలోనే ఉన్నారు.                  
 
 వరుస ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో విజయవాడను మావోయిస్టులు షెల్టర్‌జోన్‌గా చేసుకొన్నారని తెలుస్తోంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ఆటోనగర్‌లో 27 మంది ఒకే భవనంలో ఆయుధాలతో ఉన్నారు. ఇక్కడ కర్మాగారాల్లో ఉత్తరాది నుంచి వేలాదిమంది కార్మికులు వచ్చి పనిచేస్తుంటారు. ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్టర్‌ జోన్‌గా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేవ్‌జీ తన రక్షణ బృందంతో ఈ ప్రాంతంలో ఉన్న విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.ఆయనతోపాటు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పలువురు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. కాదు.. వారు పోలీసులకు లొంగిపోయారు అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. వాటిలో ఏది నిజమైనా.. మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమే అనడంలో సందేహం లేదు. ఇదే జరిగితే ఇక ఆ పార్టీ తన ఉనికి కోల్పోయినట్లే.  దేవ్‌జీతోపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల ఆచూకీపై ఈ రోజు మరింత స్పష్టత రానుంది.  హిడ్మా ఎన్‌కౌంటర్‌ అనంతరం కూడా ఆ పార్టీ తరఫున ఎటువంటి ప్రకటన విడుదల కాకపోవడం గమనార్హం. 

 దేవ్‌ జీ ఎక్కడ? 

దేవ్‌ జీ అంగరక్షకులను అరెస్టు చేశారు అంటే .. మరి ఆయన ఎక్కడున్నార్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అంటే ఆయన పోలీసుల అదపులోనే ఉన్నట్టు పౌరహక్కుల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన కార్యదర్శి స్థాయి అగ్రనేతకు మూడంచెల అంగరక్షకుల వ్యవస్థ రక్షా కవచంగా నిలుస్తుంది. అటువంటి నేతను సజీవంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం.  ఇలాంటప్పుడు దేవ్‌జీ అంగరక్షకులను పోలీసులు అరెస్టు చేస్తే.. మరి ఆయన ఎక్కడున్నారన్న ప్రశ్న తలెత్తడం సహజం. ఆయన అంగ రక్షకులకు పోలీసులతో ఎదురు కాల్పులు జరగనే లేదు. అంటే దేవ్‌ జీ ఉద్దేశ పూర్వకంగానే పోలీసులకు లొంగిపోయారా.. అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనతోపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పలువురు పోలీసులకు లొంగిపోయారని తెలుస్తోంది. దాదాపు తొమ్మిది మంది ముఖ్యులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.   

Advertisment
తాజా కథనాలు