Maoist leaders : పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ , రాజిరెడ్డి..కోర్టులో సంచలన పిటిషన్‌

మావోయిస్ట్ అగ్ర నేతలు, పార్టీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

New Update
FotoJet - 2025-11-20T131257.670

Maoist leaders Devji and Raji Reddy in police custody

Maoist leaders : అనేక దశాబ్దాలుగా పీడిత, తాడిత పేద వర్గాలకు బాసటగా నిలిచి, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలతో రైతాంగ, కార్మిక ఉద్యమాలలో భాగమైన మావోయిస్టు పార్టీ కనుమరుగవుతోంది.పార్టీ అగ్రనేతల వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. పార్టీ కేంద్ర కమిటీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలో మిగిలిన ఒకరిద్దరూ అగ్ర నేతలు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.  

ఈ మేరకు విశాఖలో పట్టుబడ్డ మావోయిస్టుల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు రహాస్య ప్రాంతంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఈ నెల 18న పోలీసులు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలను నిర్బంధంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు.  వారిని పోలీసులు ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేసే అవకాశం ఉందని ఆయన పిటిషన్‌ లో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్ రేపు హైకోర్టు ధర్మాసనం ఎదుటకు విచారణకు రానుంది.

ఒక వైపు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర భద్రతా బలగాలు దండకారణ్య ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ టాప్ లీడర్, మోస్ట్ వాంటెడ్ హిడ్మా (Hidma), ఆయన భార్యతో సహా అంగరక్షకులు ఆరుగురు మృతి చెందారు. చత్తీస్‌ఘడ్‌ లో నిర్భందం పెరిగిపోవడంతో ఆంధ్ర మీదుగా ఓడిస్సా వెళుతున్న క్రమంలో ఈ ఎన్‌ కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి ప్రాంతంలో ఈ ఎన్‌ కౌంటర్‌ జరిగింది.  

 ఇదిలా ఉండగా ఈ నెల 28 నుంచి 30 వరకు దేశంలో మావోయిస్టుల ఏరివేత, ఆపరేషన్ కగార్ , టెర్రరిస్ట్ దాడుల ఎజెండాతో ఆల్ ఇండియా డీజీపీల సమావేశం జరగనుంది. అప్పటి లోపే మావోయిస్టుల ఏరివేత పూర్తి చేయాలని  కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ముప్పేట దాడికి ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టు కేంద్ర బలగాలు అడవుల్లో అణవణువు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు అగ్రనేతలు పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారంతో పౌరహక్కుల సంఘాలు అప్రమత్తమయ్యాయి. కనీసం మిగిలిన ఒకరిద్దరూ నేతలనైన ప్రాణాలతో కాపాడుకోవాలనే ఆశతో ఆయా సంఘాలు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. అయితే పోలీసులు ఒకవేళ ఆ నేతలు పోలీసుల అదుపులో ఉంటే అరెస్ట్‌  చూపిస్తారా? లేక ఎప్పటిలాగే ఎన్‌ కౌంటర్‌ కథలు వినిపిస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు