తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏఆర్ డెయిరీ ఈ నెయ్యి సరఫరా చేసిందని తేలడంతో ఆ కంపెనీపై కేసు కూడా పెట్టారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి డెయిరీ ఎక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చింది అన్న విషయాలు వివరించింది. అయితే ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు బయటపడింది. నెయ్యి సరఫరా ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లులు, ట్యాంకర్లు ఏయే టోల్‌ప్లాజాను ఎప్పుడూ, ఎలా దాటాయి అన్న వివరాలన్నీ కూడా ఆధారణలతో సహా ఓ సీక్రెట్ రిపోర్టును వాణిజ్యశాఖ టీటీడీకి సమర్పించింది.
Also Read: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ఆ కేసులో పుణె కోర్టు సమన్లు!
ఈ నివేదిక ప్రకారం.. తిరుపతికి సమీపంలో ఉన్న వైష్ణవి డెయిరీ అనే కంపెనీ జూన్, జులై నెలల్లో ఉత్తరాఖండ్‌లోని భోలోబాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి లక్షల కేజీల నెయ్యి కోనుగోలు చేసింది. ఈ డెయిరీ నుంచే నెయ్యిని ఏఆర్ డెయిరీ కొనుగోలు చేసింది. మొత్తం 5 ట్యాంకర్లలో 8 ట్రిప్పులుగా నెయ్యి టీటీడీకి సరఫరా అయ్యింది. అందులో మూడు ట్రిప్పుల నెయ్యి ఏఆర్ డెయిరీకి వెళ్లకుండానే నేరుగా అక్కడికి సరఫరా చేశారు. మరో నాలుగు ట్యాంకర్లు దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీకి వెళ్లాయి. మళ్లీ ఆ చోటు నుంచి టీటీడీ వచ్చి నెయ్యి సరఫరా చేశారు. ఏ ట్యాంకరు దిండిగల్‌కు వెళ్లింది. ఎన్ని టోల్‌ప్లాజాలు దాటింది, ఏ ట్యాంకరు దిండిగల్ వెళ్లలేదు అన్న విషయాలు ఈ రిపోర్టులో వివరించారు. మొత్తానికి ఏఆర్ డెయిరీ ఈ వ్యవహారంలో మోసానికి పాల్పడ్డట్లు తేలింది.