Varma Vs Nagababu: పిఠాపురంలో వర్మకు మరో బిగ్ షాక్.. జనసేన అధికారిక ప్రకటన!

పిఠాపురంలో రేపు, ఎల్లుండి ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొంది. దీంతో వర్మకు చెక్ పెట్టేందుకే నాగబాబు ఎంట్రీ ఇస్తున్నాడన్న చర్చ పిఠాపురంలో జోరుగా సాగుతోంది.

New Update
Pitapuram Varma Vs Nagababu

పిఠాపురంలో టీడీపీ నేత వర్మ టార్గెట్ గా జనసేన కీలక నేత, ఎమ్మెల్సీ నాగబాబు పావులు కదుపుతున్నారు. అధికారిక పదవి లేకపోవడంతో ఇన్నాళ్లుగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం కూడా పూర్తవడంతో ఆయన ఇక పిఠాపురం నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు ఈ రోజు జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియాలోనూ ఈ మేరకు ప్రకటన విడుదలైంది. శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు ఈ నెల 4, 5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రకటన పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, పిఠాపురం పార్టీ ఇన్ఛార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. దీంతో పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు నాగబాబు చేతుల మీదుగానే జరుగుతాయని స్పష్టమైంది.

ఇక్కడి నుంచి జనసేన అధినేత, పవన్ కల్యాణ్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. డిప్యూటీ సీఎం కావడంతో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు, ఆయన శాఖలకు సంబంధించిన సమీక్షలు, సమావేశాలతో ఆయన నిత్యం బిజీగా ఉంటున్నారు. దీంతో సొంత నియోజకవర్గం పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు అప్పగిస్తారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఇందుకు సంబంధించిన లైన్ క్లీయర్ అయ్యింది. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశం ఆయనకు దక్కింది.   

వర్మకు షాక్..

గత ఎన్నికల్లో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు. అయితే.. రోజులు గడుస్తున్నా కొద్దీ వర్మకు, జనసేనకు నడుమ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. తమ కారణంగానే పవన్ గెలిచారని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటూ ఇటీవల వర్మను టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన కామెంట్స్ ఈ గ్యాప్ ను మరింత పెంచింది. ప్రస్తుతం వర్మకు ఎలాంటి అధికారిక పదవి లేకపోయినా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 

సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల మంజూరు, పంపిణీ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తన మార్క్ చూపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తున్నారు. నాగబాబు రాకతో ఇక నియోజకవర్గంలో ప్రతీ పని కూడా ఆయన చేతులమీదుగానే సాగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీంతో వర్మకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చర్చ సాగుతోంది. అసలు వర్మకు చెక్ పెట్టడానికే పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ ఇస్తున్నాడన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. 

(varma | telugu-news | telugu breaking news | latest-telugu-news | nagababu)

Advertisment
తాజా కథనాలు