/rtv/media/media_files/2025/07/11/husband-killed-his-wife-in-alluri-sitarama-raju-district-2025-07-11-17-52-15.jpg)
husband killed his wife in alluri sitarama raju district
ఏపీలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యపై అనుమానంతో ఆమెను కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భార్యపై అనుమానం
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వంగలమడుగులో జోగిదొర, విజయకుమారి (39) దంపతులు నివాసముంటున్నారు. అయితే భర్త జోగిదొరకు తన భార్య విజయ కుమారిపై ఎప్పటినుంచో అనుమానం ఉంది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇందులో భాగంగా తాజాగా భార్య విజయ కుమారిపై భర్త జోగిదొర దాడి చేసి కత్తితో పొడిచాడు.
ఈ దాడిలో భార్య విజయ కుమారి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం స్థానికులు గుర్తించి జోగిదొరను పట్టుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు జోగిదొర అడ్డతీగల పోలీసులు అదుపులో ఉన్నాడు. ఈ ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇలాంటిదే మరో విషాద ఘటన
శ్రీసత్య సాయి జిల్లా కదిరి మండలం బండవాండ్లపల్లికి చెందిన నవీన్ (35)కు గతంలో పెళ్లైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అనివార్య కారణాల వల్ల నవీన్ భార్య రెండు సంవత్సరాల కిందట ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి తండ్రి నవీన్ తన పిల్లలను చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ వేకువజామున బహిర్భూమికి వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని గ్రామ శివారులో కత్తులతో దారుణంగా పొడిచి పొడిచి హత్య చేశారు.
ఒకవైపు తల్లి రెండు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు తండ్రి హత్యకు గురికావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. అయితే ఈ మర్డర్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.