Vizag-Google: విశాఖకు మరో మణిహారం.. అమెరికా బయట అతి పెద్ద గూగుల్ ఏఐ కేంద్రం.. 2 లక్షల జాబ్స్!

సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

New Update
Google new ai centre in Vizag

సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏఐ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తదితరులు పాల్గొన్నారు.

అప్పుడు హైటెక్ సిటీ.. ఇప్పుడు వైజాగ్..

ఈ రోజు నుంచి ఈ ప్రాజెక్ట్ గూగుల్ ది మాత్రమే కాదని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది కూడా అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గతంలో హైదరాబాద్‍లో హైటెక్ సిటీ అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‍గా తీర్చిదిద్దబోతున్నామన్నారు. అప్పుడు హైదరాబాద్‍కు మైక్రోసాప్ట్ తీసుకొచ్చామని.. ప్రస్తుతం విశాఖకు గూగుల్‍ను తీసుకొస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సిఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ.. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహకారంతో అమెరికా బయట అతి పెద్ద ఏఐ కేంద్రాన్ని విశాఖపట్నంలో పెడుతున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో విశాఖలో గూగుల్ పెట్టే పెట్టుబడి $15 బిలియన్ డాలర్లు  అని వివరించారు. ఈ ఒప్పందంతో భవిష్యత్ లో 1,88,220కు పైగా ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు