/rtv/media/media_files/2025/08/08/varalaxmi-vratham-2025-08-08-06-48-19.png)
నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మార్కెట్లో పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విజయవాడ హోల్ సేల్ మార్కెట్ లో బంతిపూల ధర కేజీ రూ. 300, గూలబీ రూ. 600, చామంతి కేజీ రూ. 600 పలికింది. ఇక జాజులు, కనకంబరాలు, మల్లెలు రూ. 1200కి అమ్ముడయ్యాయి. కలువ పువ్వు ఒక్కొక్కటి రూ. 50కి అమ్ముడుపోయింది. హోల్ సేల్ మార్కెట్ లోనే ధరలు ఇలా ఉంటే రిటైల్ మార్కెట్ లో ధరలు ఇంతకంటే ఎక్కువగానే ఉంటాయి.
శ్రావణ మాసంలో పైగా వరలక్ష్మీ వ్రతం రోజున పూలకు ఈ మేర డిమాండ్ భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పూల ఎంత ధర ఉన్నప్పటికీ, వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి పూలు తప్పనిసరి కాబట్టి మహిళా భక్తులు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వినియోగదారు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విజయవాడ హోల్ సేల్ పూల మార్కెట్‌కు పూలు దిగుమతి అవుతుంటాయి.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఒక్క రోజే దాదాపుగా 60 టన్నుల బంతి, 30టన్నుల చామంతి పూలతోపాటు పెద్ద మెుత్తంలో మల్లెపూలు, గులాబీ, జాజిపూలు దిగుమతి అయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి పూలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో రవాణా ఖర్చులు పెరిగాయని అందుకే ఇలా ధరలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. శ్రావణమాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉండటం కూడా కూడా పూల ధరల పెంపుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. కొద్దిరోజుల్లో మళ్లీ ధరలు సాధారణ స్థితికి వస్తాయని చెబుతున్నారు. ఈ ధరలు మార్కెట్‌ను, ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది.
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు
వరలక్ష్మీ వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ముఖ్యంగా వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు, దీర్ఘసుమంగళీ వరం, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించడం సంప్రదాయం. పూజకు అనుకూలమైన ముహూర్తాలను పంచాంగకర్తలు ఇప్పటికే వెల్లడించారు.
ఈ రోజు పూజకు అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వంటివి తీసుకోకుండా బ్రహ్మచర్యం పాటించడం, ఇతరులతో గొడవ పడకుండా ఉండటం, ఇల్లు తుడిచి చెత్తను బయట పడవేయడం వంటివి చేయకూడదని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈ నియమాలను పాటిస్తూ వ్రతం ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.