ఆమె ఒక సీఐ తల్లి. ఊరిలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవితాన్ని సాగిస్తుంది. అయితే ఆమెకు తెలిసిన ఒక వ్యక్తి సహాయకుడిగా ఉన్నాడు. ఆమె దగ్గర లక్షల్లో అప్పు కూడా తీసుకున్నాడు. ఓ రోజు ఆమెను బయటకు తీసుకెళ్లాడు. మళ్లీ వెనక్కి తీసుకురాలేదు. ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బుగా మార్చాడు. అందులో సగం ఇంటిలో దాచిపెట్టాడు. అదే సమయంలో ఎవరికీ దొరకకుండా ఉండేందుకు సిమ్, ఫోన్ వేరు వేరుగా చేసి ఇంటిలోనే పడేశాడు. మిగతా డబ్బులతో జల్సాలు చేసేందుకు పరారయ్యాడు. కానీ ఒక ఆకలి అతడిని పోలీసులకు పట్టించింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన నాగేంద్ర ప్రసాద్ ధర్మవరం వన్ టౌన్ సీఐగా పనిచేస్తున్నారు. ఆయన తల్లి స్వర్ణకుమారి (62) మదనపల్లె పట్టణ శివారులోని జగన్ కాలనీలో నివాసముంటుంది. చిన్న చిన్నగా ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటూ అందరితో సరదాగా ముచ్చటిస్తూ ఉండేది. ఆమె ఇంటి ఎదురుగానే ఉండే వెంకటేష్ అనే వ్యక్తిది స్వర్ణకుమారి సొంతూరే. దీంతో ఆమెకు అప్పుడప్పుడూ సహాయకుడిగా ఉండే వాడు. అదే చొరవతో ఆమె వద్ద రూ.5 లక్షలు అప్పు కూడా చేశాడు.
ఇది కూడా చదవండిః ఏపీలో దారుణం.. ఏకంగా సీఐ తల్లిని కిడ్నాప్ చేసి..
ఆమెకు భక్తి భావాజాలం ఎక్కువ. అందుచేత గత నెల 28వ తేదీన వెంకటేష్ ఆమెను ఒక పూజారి దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి బండి ఎక్కించుకున్నాడు. అయితే మూడు రోజులైనా ఆమె కనిపించకపోవడంతో చుట్టు పక్కల ఉండేవారు ఆమె కొడుకు సీఐ నాగేంద్ర ప్రసాద్ కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఈనెల 2న మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుకింద కేసు నమోదు చేశారు. అయితే మరోవైపు ఆమె నగలను వెంకటేష్ ప్రైవేటు ఫైనాన్స్ లో కుదవ పెట్టి డబ్బులు తీసుకున్నాడు. కొంత ఇంట్లోనే దాచాడు. ఫోన్, సిమ్ కార్డులను ఇంట్లోనే పడేసి పరారయ్యాడు.
హంతకుడిని పంటించిన స్విగ్గీ
పరారైన వెంకటేష్ బెంగళూరులో ఉన్నట్లు.. అక్కడ వేరే సిమ్, ఫోన్ వాడుతున్నట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం వెంకటేష్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టడాన్ని గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి అతడిని పట్టుకున్నారు. అనంతరం వెంకటేష్ ను మదనపల్లె తీసుకుని వచ్చారు. అక్కడ స్మశానవాటికలో స్వర్ణకుమారిని పూడ్చిపెట్టిన సమాధిని చూపించారు.
అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పక్కనే మరో గొయ్యితీసి అంత్యక్రియలు జరిపారు. అయితే ఇందులో వెంకటేష్ ఒక్కడే కాదు. మరో వ్యక్తి కూడా ఉన్నాడు. మదనపల్లె గజ్జెలకుంటకు చెందిన అనిల్, వెంకటేష్ ఇద్దరూ ఫ్రెండ్స్. అతని ఇంట్లోనే స్వర్ణకుమారిని హత్య చేసి గోనెసంచెలో చుట్టారు. ఆపై అద్దెకు కారు తీసుకుని పూడ్చిపెట్టారు. ప్రస్తుతం అనిల్ పరారిలో ఉన్నాడు. కాగా వీరిద్దరూ గంజాయికి అలవాటు పడి నేరాలు చేసినట్లు తెలుస్తోంది.