ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ శుక్రవారం తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన డిక్లరేషన్‌పై సంతకం చేయాలనే డిమాండ్లు రావడంతో.. అనూహ్యంగా ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌ను తిరుమల వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ర్యాలీలు జనసమీకరణలు మాత్రమే చేయొద్దని చెప్పామని పేర్కొన్నారు. తిరుమల వివాదంపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు.
''తిరుమలకు వెళ్లకుండా నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. జగన్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారా ?. ఇస్తే మీడియాకు చూపించాలి. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు. ఇటీవల తిరుమలలో చోటుచేసుకున్న పరిణాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు తిరుపతిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. తిరుమలకు వెళ్లాలనుకునేవారు ఎవరైనా ఆలయ ఆచారాలు, నియమాలు పాటించాల్సిందే. ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. సొంత మతాన్ని ఆచరించాలి.. ఇతర మతాలను గౌరవించాలి
ఇంతకుముందు కూడా జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్లారు. ఇతర మతాలను గౌరవించడం అంటే వాటి ఆయా ఆలయ సంప్రదాయాలు పాటించడమే. బైబిల్‌ను నాలుగు గోడల మధ్యే ఎందుకు చదవాలి. చర్చికి కూడా వెళ్లి చదువుకోవచ్చు. జగన్ చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదని చెబుతున్నారు. ఏఆర్ డెయిరీ 8 ట్యాంకర్ల నెయ్యి పంపగా అందులో నాలుగు ట్యాంకర్లు వాడారు. నెయ్యి కల్తీ జరిగినట్లు ఎన్‌డీడీబీ రిపోర్టు ఇచ్చింది. మేము కాదు. ఈ రిపోర్టును దాస్తే మేము కూడా తప్పు చేసినట్లే అవుతుంది. నెయ్యి కల్తీ జరగలేదని మీరెలా చెబుతారు? అడల్టరేషన్ పరీక్షలకు గతంలోనే మీరు ఎందుకు పంపలేదు? టెండర్లు పిలిచేందుకు నిబంధనలు ఎందుకు మార్చాలో చెప్పండి.
నాసిరకం పదార్థాలతో ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. టీటీడీ అధికారుల నియామకంలో మీరు అధికార దుర్వినియోగం చేశారు. తిరుమలలో తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తే సంప్రోక్షణ చేస్తారు. ఈనెల 23న శాంతి యాగం చేశారు. ఆలయంలో నాణ్యత, స్వచ్ఛత, పవిత్రత ఎంతో ముఖ్యం. ఆలయ సన్నిధిలో మళ్లీ అపవిత్రత జరగకుండా చూస్తాం. కల్తీ ఘటనకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటాం అని'' చంద్రబాబు వివరించారు.