Sankranti : సంక్రాంతి బరిలోకి దిగేందుకు సై అంటోన్న పందెం కోళ్లు

సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్‌లో గుర్తొచ్చేవి కోడి పందేలు. ఏపీలో సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడో స్థిరపడిన ఆంధ్రవారు అంతా తమ సొంతూళ్లుకు చేరుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా గ్రామాలకు చేరుకుంటారు. కోడి పందేల కోసం నెలల తరబడి కోళ్లకు శిక్షణ ఇస్తుంటారు.

New Update
FotoJet (4)

cockfighting in Andhra Pradesh

Sankranti  : సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్‌లో గుర్తొచ్చేవి కోడి పందేలు. ఏపీలో సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడో స్థిరపడిన ఆంధ్రవారు అంతా తమ సొంతూళ్లుకు చేరుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా సంక్రాంతికి తమ గ్రామాలకు చేరుకుంటారు. ఈ కోడి పందేల కోసం నెలల తరబడి కోళ్లకు శిక్షణ ఇస్తుంటారు. వాటి ఎంపిక నుంచి శిక్షణ వరకు, అది తినే డైట్‌ నుంచి బరిలో చేసే ఫైట్‌ వరకు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడిపందేలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఏపీలోపెద్ద పండగగా గుర్తింపు పొందిన సంక్రాంతికి సంప్రదాయ క్రీడలుగా మొదలైన కోడి పందేలు ఆ తర్వాత అతి పెద్ద జూదంగా, కోట్లలో పందేలు కాసే స్థాయికి చేరుకున్నాయి.  

 కాగా ఈ పందేళ్లో తలపడే కోళ్లకు శిక్షణ ఇచ్చేందుకు కాక్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఉంటాయి.బ్రాండింగ్‌ ఉండి, గతంలో పందేల్లో గెలిచిన ఎక్కువ కోళ్లకు శిక్షణనిచ్చిన కాక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ల వారికి మంచి గిరాకీ ఉంటుంది. ఒకపుడు రాజుల కోటల్లో ఇలాంటి శిక్షణనిచ్చిన కుటుంబాలకు చెందినవారు వంశపారంపర్యంగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. అలాంటివారినీ కోళ్లకు శిక్షణనిచ్చేందుకు ప్రత్యేకంగా నియమించుకుంటారు.

దీనికోసం హైదరాబాద్‌ బార్కాస్‌లో పహిల్వాన్‌ల వద్ద శిక్షణ పొందిన పుంజులను పందేం కాయడానికి తీసుకొస్తుంటారు. మరికొందరు ఆ పహిల్వాన్‌ వద్ద శిక్షణ పొందిన వారిని తీసుకువచ్చి కోళ్లకు తర్ఫీదు ఇప్పిస్తుంటారు. కోనసీమలోని రావులపాలెంలాంటి ప్రాంతాల వారైతే కోల్‌కతా నుంచి పందేం కోళ్ల నిపుణులను రప్పిస్తుంటారు. ఇలా శిక్షణనిచ్చేవారు ఒక్కొక్కరు 10-15 కోళ్లను మాత్రమే పర్యవేక్షిస్తుంటారు. వీరికి నెలకు రూ.15-20 వేలు జీతం కూడా ఉంటుంది. సాధారణంగా ఈ శిక్షణ దసరా నుంచి మొదలవుతుంది. ఈ షార్ట్‌టర్మ్‌ కోర్సు బాగా పాపులర్‌. కొన్నిచోట్ల క్రాష్‌కోర్స్‌లాగా ఇంకా తక్కువ రోజుల్లోనూ ఇస్తారు. మరికొన్ని కేంద్రాల్లో ఏడాది పొడవునా శిక్షణ ఇస్తారు.

పందెం కోడికి ఏం ఇస్తారంటే?

పందెం కోడి శిక్షణ తెల్లవారుజామున 5 గంటల నుంచే మొదలవుతుంది. పందేనికి 60 రోజుల ముందు నుంచి రోజూ ఉదయాన్నే డ్రైఫ్రూట్‌ లడ్డూ, ఖీమా, కొన్ని రకాల ఆకుకూరలను ఉడకబెట్టి పెడుతారు. 40 రోజుల ముందు నుంచి గుడ్డు తెల్లసొన పెడతారు. వాటిని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరుబయట ఉంచుతారు. వాటికి నడకతోపాటు కొన్ని రకాల కసరత్తులు నేర్పుతారు.సాయంత్రం 4 గంటలకు మేతగా గింజలు వేస్తారు.ఆ తర్వాత తెల్లవారేవరకు వాటికి రెస్ట్‌ ఇస్తారు. జనంలో ఉన్నప్పుడు భయపడకుండా ఉండేందుకు చేత్తో మేత పెడతారు. బెరుకును పోగొట్టే ప్రయత్నం చేస్తారు.చురుగ్గా ఉండేలా చేసేందుకు వారానికి ఒకటి రెండుసార్లు నీటిలో ఈత కొట్టిస్తారు. రింగులో ఐదారు కోళ్లను వదిలేసి, ఏది చివరి వరకూ ఉంటుందో చూస్తారు. దానిలా మిగిలినవీ ఉండేలా శిక్షణ ఇస్తారు. సంక్రాంతికి వారం ముందు నుంచి పందేనికి వెళ్లే వరకు కోడికి పూర్తిగా రెస్ట్‌ ఇస్తారు. శిక్షణలో భాగంగా కోళ్లకు ఆయాసం రాకుండా, కొవ్వు పెరగకుండా, నరాలు ఫ్రీ అయ్యేందుకు నాలుగైదు రోజులకోసారి బి విటమిన్, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లూ ఇస్తారు. చలికాలం మూలంగా కోళ్లకు కొక్కెర వ్యాధి, కొరేగా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు, వస్తే నియంత్రణ కోసం యాంటీబయాటిక్స్‌నూ ఇస్తారు.

Screenshot 2026-01-02 203444ww

పందెం కోళ్లకు ‘నీరు’పోత

బరిలో దిగాగ అవతలి కోడి పొడిచే కత్తిపోట్లు, కాలిగోటి దెబ్బలకు నొప్పి తెలియకుండా ఉండేందుకు, శరీరాన్ని సిద్ధం చేసేందుకు నీళ్లపోతలు, ‘శాక’లు తీస్తారు. వీటితో కోళ్ల శరీరం గట్టిపడి, దెబ్బ తగిలినా నొప్పి తెలియక పోరాడడానికి ఉపకరిస్తుంది. ఈ నీరుపోతలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తుంటారు. యూకలిప్టస్, కుంకుడు, వెదురు చెట్ల ఆకులు, జామాయిల్, పసుపుకొమ్ములు, తుమ్మ బెరడు వంటి 15-20 రకాలను కలిపి నీటిలో మరిగిస్తారు. ఆ ద్రావణాన్ని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కోడిని ముంచడం గానీ, లేదా కోడిపై పోయడం చేస్తుంటారు. 10-15 రోజులకోసారి ఇలా చేస్తారు. పెనం/మూకుడు వేడి చేసి దానిపై చీప్‌ లిక్కర్‌ పోసి, వచ్చే ఆవిరిని వస్త్రంతో కోడి శరీరానికి అద్దుతారు. దీన్ని శాక తీయడం అంటారు.

 ప్రత్యేక శాస్త్రమూ..

పందెంలో గెలవాలంటే కోడిని ఏ దిక్కు నుంచి బరిలోకి దింపాలి, ఏ రోజు ఏ రకం కోడి పందెంలో నెగ్గుతుంది, ఏ జాతి కోడి ఏ జాతి కోడితో సరిగా కలబడుతుంది. అని తెలుసుకోవడానికి ప్రత్యేక లెక్కలుంటాయి. దీన్ని ‘కుక్కుటశాస్త్రం’ చూసి నిర్ణయిస్తారట. ఈ శాస్త్ర ప్రకారం వారాలు, పక్షాల ప్రకారం కొన్ని జాతుల కోడి పుంజుల జీర్ణశక్తి మందగించే రోజులు ఏవో గుర్తిస్తారు. అలాంటి సమయంలో వాటిని బరిలోకి దింపితే ఓడిపోతాయని తెలుసుకుంటారు. ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేలను ప్రారంభించే ముందు ఈ కుక్కుటశాస్త్రాన్ని చదువుతుంటారట.

sankranti-kodi-pandalu

కాలి ‘కాటా’నే కత్తి..

ఇక పందేల్లో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపటం ఆనావాయితీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నున్న తదితర ప్రాంతాల్లో కత్తి కట్టకుండానే పందేనికి దించుతారు. కోడి కాళ్లకు సహజంగా పెరిగే ‘కాటా’నే ఆయుధంగా ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. కాటాలు పెరుగుతున్నప్పుడు వాటిని షేప్‌ చేస్తూ.. బరిలోకి దింపే సమయానికి దాన్ని మొనదేలేలా చేస్తారు. ఆ కాటాతోనే ఎదుటి కోడిపై దాడి చేసి దెబ్బతీయాలి కాబట్టి ఈ పోటీ చాలాసేపు కొనసాగే అవకాశం ఉంది.

పలు జాతులు..ప్రత్యేక శిక్షణ

కాగా కోళ్ల పందేలకు అన్ని రకాల కోళ్లు పనికిరావు. పందేం కోళ్లు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో డేగ, నెమలి, కాకి, ముంగిస, సవల, కొక్కిరాయి.. ఇలా పలు రకాల జాతుల కోళ్లతో పందేలు వేస్తుంటారు. కాగా వీటిని పందేలకు సిద్ధం చేసేందుకు ఇప్పటికే ఆంధ్ర అంతటా భారీస్థాయిలో కేంద్రాలు వెలిశాయి. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 200వరకు, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నున్న పరిసర ప్రాంతాల్లో 150 వరకు నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు/కాక్‌ ట్రైనింగ్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ దాదాపు 200 వరకు కాక్‌ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. సంక్రాంతికి బరిలో దిగేందుకు కోళ్లు. పందేలు నిర్వహించేందుకు నిర్వహకులు సిద్దమయ్యారు.

Advertisment
తాజా కథనాలు