Jogi Ramesh: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో రేపు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా ఇదే కేసులో విచారణలో భాగంగా ఇటీవల జోగి రమేష్ మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి హాజరైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటి వరకు రెండు సార్లు విచారణను ఎదుర్కొన్నారు ఆయన. గతంలో నోటీసుల్లో ఇచ్చిన తేదీన వెళ్లకుండా కొద్దీ రోజుల తరువాత విచారణకు వెళ్లారు. మరి రేపు ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
ఉరటనిచ్చిన సుప్రీం...
ఇటీవల టీడీపీ ఆఫీస్ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్ కు సుప్రీం కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వారు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారి పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం రమేష్, అవినాష్లపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వారు విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. పాస్ పోర్టులను అధికారులకు అప్పగించాలని తెలిపింది.