Road Accident: నంద్యాల లో అర్థరాత్రి బస్సు దగ్ధం. స్పాట్ లో ముగ్గురు

ఏపీలో వరుస బస్సుప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు లారీడ్రైవర్, క్లీనర్‌ మృతిచెందారు.  

New Update
FotoJet - 2026-01-22T064943.826

Bus accident

Road Accident:  ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు మరిచిపోక ముందే..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల విహారయాత్ర బస్సు ప్రమాదం జరిగి ఒక రోజు గడవకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపుతప్పింది.. డివైడర్‌ మీదుగా దూసుకెళ్లి రోడ్డు అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని దగ్ధమైంది..ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ఏఆర్‌బీసీవీఆర్‌ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటిప సమయంలో నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్దకు చేరుకుంది. బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్‌ మృతిచెందారు.  ప్రమాదం జరిగిన తర్వాత బస్సుకు ఒక్కసారిగా మంటలు వ్యాపించారు.

ఆ దారిన వెళ్తున్న డీసీఎం డ్రైవర్‌ అప్రమత్తమై తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీల్లోంచి దూకేయడంతో పదిమందికిపైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మంటలు విస్తరించడంతో లారీ కూడా కాలిపోయింది. బస్సు డ్రైవరుతో పాటు లారీ డ్రైవర్‌, క్లీనర్‌ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు