/rtv/media/media_files/2025/12/08/ravi-prakash-2025-12-08-19-30-44.jpg)
BJP Leader Yamini Sharma Parised Ravi Prakash Sillicon Andhra Sanjivani Hopsital
ప్రతి మనిషికి తన జీవితంలో ముఖ్యంగా అవసరమయ్యేది విద్య, వైద్యం. కానీ ప్రస్తుత రోజుల్లో ఇవి రెండు చాలా ఖరీదుగా మారిపోయాయి. నాణ్యమైన విద్య, వైద్యం కోసం అందరూ ప్రైవేటు వ్యవస్థలనే ఆశ్రయిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరితే లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిందే. దీనివల్ల ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుంది. ఏళ్లుగా సంపాదించిన తమ ఆదాయం అంతా ఆస్పత్రిపాలు అవుతుంది. ఇలాంటి తరుణంలో కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందించే ఆస్పత్రి ఉంటే ఎంతబాగుంటుంది అని అనుకుంటాం. కానీ నిజంగానే అలాంటి ఆస్పత్రి ఉంది. ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉంది. దానిపేరే రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి.
ఈ ఆస్పత్రిలో కేవలం వైద్య చికిత్సలు, పరీక్షలు మాత్రమే కాదు అవసరమైన సర్జరీల సేవలు కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాశ్ నేతృత్వంలో ఈ ఆస్పత్రిని నిర్మించారు. అయితే ఇటీవల బీజేపీ నాయకురాలు యామిని శర్మ ఇటీవల ఆ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆమె ఈ ఆస్పత్రి గురించి ఎక్స్‌లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. '' భారత శాస్త్రీయ నృత్య రాజధాని అయిన కూచిపూడిలో ఓ అద్భుతమైన ఆస్పత్రికి వెళ్లాను. ఆ ఆస్పత్రిని చూశాక నేను ఆశ్చర్యపోయాను. అదొక ప్రపంచ స్థాయి ఆస్పత్రి, పూర్తిగా చారిటీ నిధులతో ఆ ఆస్పత్రి నడుస్తోంది. ప్రతి రోగ నిర్ధారణ, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సల సేవలు అక్కడ ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. ఎలాంటి బిల్లులు లేవు, షరతులు లేవు, వివక్ష అనేదే లేదు.
సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల విజన్‌తో, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్‌తో పాటు మరెంతోమంది సహకారంతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో అధునాతన వైద్య పరికరాల నుంచి ఎలాంటి మచ్చలేని మౌలికసదుపాయాల వరకు ప్రతిదీ కూడా నిబద్ధత, కరుణ, దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఒక ఆస్పత్రి మాత్రమే కాదు. ఇది మానవత్వం, సేవ, నిజమైన దేశ నిర్మాణం ఇలా ఉంటుంది. దీనిపై గర్వంగా ఉందంటూ'' యామిని శర్మ రాసుకొచ్చారు.
Today I visited an extraordinary hospital in the heart of India’s classical dance capital #Kuchipudi — and I’m honestly stunned.
— Sadineni Yamini Sharma (@YaminiSharma_AP) December 7, 2025
A world-class hospital, run entirely on charity, offering every diagnosis, medical test and even surgeries at ₹0 cost to the people. No bill. No… pic.twitter.com/SFmuqFdjjt
ఇదిలాఉండగా సిలికాన్ ఆంధ్ర సీఈవో కూచిపట్ల ఆనంద్‌తో కలసి రవిప్రకాష్ కూచిపూడిలో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. దీని నిర్మాణం కోసం గతంలో రవి ప్రకాష్ నిధులు సేకరించారు. ఆయన టీవీ9 సీఆవోగా పనిచేస్తున్న సమయంలో.. ఛానల్‌లో రెండు రోజుల పాటు నిర్విరామంగా ఎలాంటి యాడ్స్ ఇవ్వకుండా కేవలం ఈ సంజీవని హాస్పిటల్ కోసం ఫండ్ రైజింగ్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కూచిపూడి పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సదుపాయం అందుబాటులో లేదు. పేదరికం ఎక్కవగా ఉంటుంది. అందువల్లే అక్కడ ఈ ఆస్పత్రిని ప్రారంభించారు.
ఈ ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు వారి తరఫున వచ్చే అటెండర్‌కు కూడా భోజన వసతి కల్పిస్తున్నారు. ఉచిత ఓపీతో పాటు.. మందులు కూడా ఫ్రీగానే అందిస్తున్నారు. ఉచితంగా ఇలాంటి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం వల్ల మాలాంటి పేదవాళ్లకి ఎంతో మేలు జరుగుతుందని అక్కడికి వస్తున్న రోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో విజయవాడ, మచిలీపట్నం వెళ్లాల్సి వచ్చేదని.. ప్రస్తుతం కూచిపూడిలోనే రవి ప్రకాష్ సిలికానంద సంజీవిని హాస్పిటల్‌లోనే మెరుగైన వైద్యం కోసం వస్తున్నామని చెబుతున్నారు.
అంతేకాదు ఈ ఆస్పత్రిలో కార్పోరెట్ ఆస్పత్రిని మించిన స్థాయిలో సదుపాయాలు ఉండటం విశేషం. ప్రతి వార్డులో కూడా పేషెంట్ కోసం అత్యంత ఖరీదైన బెడ్స్ ఉన్నాయి. ఆర్థోపెడిక్, న్యూరో, చిన్నపిల్లల వైద్యుడు, దంత వైద్యుడు, గైనకాలజిస్ట్ విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం 24 గంటలపాటు ఈ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కూచిపూడి సహా దాని చుట్టుపక్కల ఉన్న దాదాపు 70 గ్రామాల నుంచి ఇక్కడ అత్యాధునిక వైద్య సదుపాయాలను ఉచితంగా పొందుతున్నారు.
Follow Us