Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తుంది.ఓ వైపు సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం అంటూ లీకులు వచ్చిన కొద్ది సేపటికే.. ఓ పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై పెద్ద వేటు వేసింది. తాజా నిర్ణయంతో స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ నుంచి ఔట్ కానున్నారు.
బయో మెట్రిక్ నుంచి కార్మికుల ఐడీలు తొలగించారు.. బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 2500 మందికి ఆఫర్ ఇచ్చారు. దీని కోసం 14 వేల కోట్లు కేటాయించిన RINL. ఇక, 500 మందిని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
కానీ, కార్మిక సంఘాలు మరోసారి ఆందోళన బాటపట్టాయి. నేడు ట్రైనింగ్ సెంటర్ దగ్గర భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే.. వైజాగ్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందంటూ వార్తలు వచ్చాయి. కార్మిక పోరాటాలు, పొలిటీకల్ లాబీయింగ్ స్టీల్ ప్లాంట్ పరి రక్షణ దిశగా కీలకంగా మారాయని.. దీంతో తెగనమ్మేయాలనే ఆలోచనలకు ఎన్డీఏ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టే దిశగా దృష్టిసారించిందని.. ఆ దిశగా RINLను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తారనే సంకేతాలు బలంగా వినిపించాయి.
కాగా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఉద్యమనాదమైన వేళ అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 32 మంది ప్రాణాలు అర్పించిన ఫలితంగా ఏర్పాటైన ఈ భారీ పరిశ్రమ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని నిలబడింది. అందుకే వైజాగ్ స్టీల్ అంటే ఒక ఇండస్ట్రీ కాదు సెంటిమెంట్.. ఆర్ధిక నష్టాల్లోకి నెట్టివేసిన ప్రతీసారీ సంక్షోభం నుంచి బయటపడి తన మనుగడను కాపాడుకుంటూనే ఉంది.
కాగా, ఇప్పుడు పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కార్మికుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read: జగన్‌కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్