BIG BREAKING: మైదానంలో అరెస్ట్‌లు.. ఏజెన్సీలో  ఎదురు కాల్పులు..ఏపీలో ఎం జరుగుతోంది?

ఏపీలో నిన్నటి నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులకు,మావోయిస్టులకు మధ్య వరుసగా ఎన్‌ కౌంటర్లు జరుగుతున్నాయి. మరోవైపు విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 50 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Maoist Killed

Maoist Killed

  BIG BREAKING:  ఏపీలో నిన్నటి నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు పలు అనమానాలకు తావిస్తున్నాయి. నిన్నటి నుంచి పోలీసులకు,మావోయిస్టులకు మధ్య వరుసగా ఎన్‌ కౌంటర్లు జరుగుతున్నాయి. మరోవైపు విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 50 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందడం సంచలనం రేపింది. అదే సమయంలో పార్టీ కార్యదర్శి దేవ్‌జీ  పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. 

ఈ మేరకు ఏపీ ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ మహేష్‌ చంద్ర లడ్డా ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారన్నారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్‌ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.  ‘ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో  పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నామన్నారు. నవంబరు 17న ఒక ఆపరేషన్‌ లాంచ్‌ చేశాం. 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ హిడ్మా మద్వితో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారన్నారు. 

మరోవైపు ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులని అరెస్టు చేశాం. వీరిలో స్పెషల్ జోనల్‌ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్‌ మెంబర్లు 23 మంది, డివిజినల్‌ కమిటీ మెంబర్లు ఐదుగురు, ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉన్నారని తెలిపారు. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నాం. మంగళవారం జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారు. వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. ఇక హిడ్మా మరణంపై వస్తున్న అనుమానాలను ఆయన కొట్టిపడేశారు.ఆయన్ను పట్టుకున్నాక చంపారనే విషయంలో వాస్తవం లేదు. మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్‌ కోసం కృషి చేస్తున్నాం. మావోయిస్టుల ప్లాన్‌ ఏంటో, కానూరులో ఎందుకున్నారో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో చాలా మంది లొంగిపోతారు. అరెస్టుల వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఛత్తీస్‌గఢ్‌లో చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మావోయిస్టులు వెళ్తున్నారు. ఈక్రమంలో వారు పట్టుబడుతున్నారు’’ అని ఏడీజీ తెలిపారు.


మరో ఎన్‌కౌంటర్,,ఏడుగురు మృతి

ఇదిలా ఉండగానే ఈ ఉదయం మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.  బుధవారం ఉదయం మారేడుమిల్లి మండలం  జీఎంవలస సమీపంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో శ్రీకాకుళానికి చెందిన ఆంధ్ర, ఒడిస్సా ఇంఛార్జ్‌ జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందారు. వెపన్స్‌ డీలింగ్‌లో శంకర్‌ది కీలక పాత్ర. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇక.. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియా సమావేశం సందర్బంగా ధృవీకరించారు. 

చత్తీస్‌ఘడ్‌లో మరో ఎన్‌ కౌంటర్‌ 

ఇదిలా ఉండగానే చత్తీస్‌ఘడ్‌లో ఈ రోజు మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎన్‌ కౌంటర్‌ స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల అదుపులోనే దేవ్‌జీ?

అయితే నిన్న పట్టుబడిన కీలక నేతలలో దేవ్ జీ కూడా ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు మాత్రం పట్టుబడిన కీలకనేతల పేర్లు ఇంతవరకు వెల్లడించలేదు. దేవ్ జీ కి సంబంధించిన ప్రచారాన్ని కూడా కొట్టిపారేస్తున్నారు. అయితే అగ్రనేతలంతా పోలీసుల అదుపులోనే ఉన్నారని, పోలీసులు కావాలనే గోప్యత పాటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది, చిన్నస్థాయి నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చూపిస్తూ అగ్రనేతలను ఎన్‌కౌంటర్‌ పేరుతో కాల్చి చంపుతున్నారనే వాదన వినపడుతోంది. ముఖ్యనేతలు ఇచ్చిన సమాచారంతోనే విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో తలదాచుకున్న వారిని అదుపులోకి తీసుకుని కీలక నేతలను మాత్రం హతమారుస్తున్నారని తెలుస్తోంది. అయితే అందరినీ ఒకే చోట ఎన్‌ కౌంటర్‌ పేరుతో చంపితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్‌ పేరుతో వారిని తుదముట్టిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఏదేమైనా రెండు రోజులుగా ఏపీలో వరుసగా అరెస్ట్‌లు, ఎన్‌కౌంటర్లతో అసలేం జరుగుతుందనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కాగా  పౌర హక్కుల సంఘం నాయకులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisment
తాజా కథనాలు