Balineni Srinivasa :
వైసీపీ సీనియర్ నేత, జగన్ కు దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం మరోసారి స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారన్న వార్తలు మళ్లీ మొదలయ్యాయి. ఈ సారి ఆయన కండువా మార్చడం ఖాయమని తెలుస్తోంది. దసరా పండుగ రోజు పార్టీ మారడంపై బాలినేని ప్రకటన చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా జనసేన నేతలతో బాలినేని మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో మాజీ మంత్రి ఈ మేరకు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే.. పార్టీ మార్పుపై కుటుంబసభ్యులు మాత్రం తీవ్ర అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. తెలంగాణలో కూటమి జట్టుకు మొదటి మెట్టయిందా?
కొంతకాలంగా వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ ఆయన సూచించిన కొందరిని జగన్ పక్కకు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్పుడే బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలోనే కొనసాగారు.
Also Read : జనసేనలో ఒక్కసారిగా భగ్గుమన్న విభేదాలు
జిల్లాలో వైసీపీ (YCP) లో మరో కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో కూడా బాలినేనికి విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై కూడా బాలినేని గుర్రుగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే బాలినేని చేరికపై జనసేన, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. బాలినేని మాత్రం నేరుగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనే మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read : జనసేన Vs టీడీపీ... కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్!