/rtv/media/media_files/2025/07/24/hari-hara-veeramallu-story-2025-07-24-16-56-12.jpg)
ఈ రోజు విడుదలైన పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాపై సీపీఎం నేతలు భగ్గుమన్నారు. చారిత్రక ఆధారాలు లేని కాల్పనిక కథ ‘హరిహర వీరమల్లు’ సినిమాపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సీపీఏం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ సినిమా హీరో, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు గురువారం ఒక లేఖ రాశారు. ‘హరిహర వీరముల్లు’ చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారన్నారు. కానీ పవన్ అభిమానులు, ప్రజలు దీనిని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారన్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదన్నారు. ఈ సినిమా కాల్పనిక కట్టు కథ అని ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు.
ప్రజలకు వాస్తవాలు చెప్పండి..
బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న పవన్ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పవన్ పై ఉందన్నారు. ‘హరిహర వీరమల్లు’ పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవన్నారు. మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటి వాస్తవాలకు కట్టు కథలను జోడించడం వల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం 700 సంవత్సరాల క్రితమే కాకతీయుల సామ్రాజ్యానికి చేరిందన్నారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొగల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్ షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్ వారికి అది లభించిందని వివరించారు. బ్రిటిష్ వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారన్నారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవమన్నారు. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదన్నారు.
అయితే.. సినిమాలో బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయిందని.. వారు భారతదేశంలో, అంతర్భాగం అయిపోయారన్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయిందన్నారు. బ్రిటీష్ వాళ్లు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్లి పోయారన్నారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా పవన్ గుర్తించాలన్నారు. 11 ఏళ్లుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పిస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు. ఆ పని చేయకుండా కట్టుకథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరారు.