టీడీపీ యువనేత, మంత్రి లోకేష్ కు మరో కీలక పదవి లభించనుందా? మహానాడు వేదికగా ఆయనకు ప్రమోషన్ పై అధినేత చంద్రబాబు నుంచి కీలక ప్రకటన రానుందా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం ఔను అనే వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో నిర్వహించనున్న పార్టీ మహానాడులో ఈ మేరకు ప్రకటన వస్తుందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఇప్పటికే మహానాడుకు సంబంధించి లోకేష్ కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా అన్ని విభాగాలతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. మహానాడుకు సంబంధించిన నిర్ణయాల బాధ్యత లోకేష్‌కే వదిలేశారు చంద్రబాబు. పార్టీలో ఒకే పదవిలో రెండుసార్లు కంటే ఎక్కువసార్లు పనిచేయొద్దని లోకేష్ గతంలో అనేక సార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పదవి కూడా మారబోతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్లలో లోకేష్ పార్టీలో కీలకంగా పని చేశారు. యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించి పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలన్నీ ఆయనే చూసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనదైన మార్కుతో ముందుకు వెళ్తున్నారు లోకేష్. ప్రజాదర్బార్ పేరిట సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్..
కొన్ని రోజుల క్రితం లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలని టీడీపీ నేతల నుంచి తీవ్రమైన డిమాండ్ వచ్చింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయమై సోషల్ మీడియాను పోస్టులతో హోరెత్తించారు. అయితే.. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడం తమ అధినేతను తగ్గించినట్లు అవుతుందని జనసేన శ్రేణులు కౌంటర్లు ఇచ్చారు. కొన్ని రోజుల పాటు ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్రమైన రచ్చ జరిగింది. కానీ ఈ అంశంపై ఎవరూ చర్చించవద్దంటూ టీడీపీ నాయకత్వం నుంచి వచ్చిన ప్రకటనతో అంతా సైలెంట్ అయ్యారు.
(ap minister nara lokesh | telugu-news | telugu breaking news)