గత ప్రభుత్వ హయాంలో ఎవరూ స్వేచ్ఛగా తిరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన స్వేచ్ఛను ఎవరూ దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో జరిగిన మహాత్మ జ్యోతీరావు పూలే జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. సోషల్ మీడియా నేరస్తులకు అడ్డాగా మారిందన్నారు. సోషల్ మీడియా ద్వారా ఎవరి వ్యక్తిత్వ హననం చేసినా వాళ్లకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. పిల్లలను మంచి పౌరులుగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని పేరెంట్స్ కు సూచించారు. తప్పు చేసిన వాళ్ల విషయంలో చంఢశాసనుడిగా ఉంటానని హెచ్చరించారు. వివేకానంద రెడ్డిది గుండెపోటు అని మొదట జరిగిన ప్రచారాన్ని నమ్మి మోసపోయానని.. ఆ తర్వాత అది గొడ్డలి పోటు అని అన్నారు. తప్పుడు ప్రచారం చేసినా, తప్పుగా మాట్లాడినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనన్నారు. తనపైన ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాననే విశ్వాసం ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదని, సమైక్యాంధ్రలో తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తనకు వేరే ఆశలు లేవని, మీ ప్రేమాభిమానాలు ఉంటే చాలని అన్నారు. మీ ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పినట్టే రుజువు చేస్తున్నానని చెప్పారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచేపోయే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరన్నారు. బడుగు బలహీనవర్గాల ఆరాధ్య దైవం ఆయనని అన్నారు.
198 ఏళ్లయినా ఇంకా పూలే జయంతి జరుపుకుంటున్నామంటే అదే ఆయన మనకు ఇచ్చిన స్ఫూర్తి అని అన్నారు. స్త్రీ విద్యకు ఆ రోజుల్లోనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని తన సతీమణిని ప్రోత్సహించి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చేశారన్నారు. బాల్య వివాహాలు, సతీసహగమనాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకు కృషి చేశారు. అంబేద్కర్ సైతం ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచారంటే పూలే గొప్పతనం అర్థం చేసుకోవచ్చన్నారు.
రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది ఎన్టీఆర్
పూలే బాటలోనే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాష్ట్రంలో మహిళా విద్యకు పెద్దపీట వేసి ఏకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు బీసీలకు న్యాయం జరగలేదన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటగా గుర్తించింది ఎన్టీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీకి వెన్నుముక బీసీలని, బీసీలను ఆదరించే బాధ్యత టీడీపీదన్నారు. తనతో సహా ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్... ఇలా అందరం బీసీల కోసం ఆలోచిస్తున్నాం... వారి కోసం పనిచేస్తున్నామన్నారు.
(telugu-news | telugu breaking news | latest-telugu-news)