తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై సుప్రీం కోర్టు ఆదేశాలను తాను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేశారు. సీబీఐ, ఏపీ పోలీస్, FSSAI అధికారులతో సిట్ ఏర్పాటు చేసి తిరుపతి లడ్డూ కల్తీపై విచారణ చేయాలని ఈ రోజు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానని X ఖాతాలో పోస్టు చేసిన చంద్రబాబు.. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ! అంటూ ముగించారు.
తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరో ఇద్దరు, FSSAI నుంచి ఒకరు.. మొత్తం ఐదుగురు సభ్యులు ఈ సిట్ లో ఉండాలని తన ఆదేశాల్లో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రద్దు..
తిరుపతిలో లడ్డూ కల్తీ అంశంపై వాస్తవాలను వెలికి తీసేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఆ సిట్ విచారణను నిలిపివేసింది. తాజాగా సీబీఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలంటూ సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇక రద్దు కానుంది.