/rtv/media/media_files/2026/01/31/guinness-world-record-2026-01-31-17-59-37.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పర్యావరణ హిత చర్యల్లో భాగంగా కుప్పం నియోజకవర్గంలో సరికొత్త చరిత్ర నమోదైంది. కాలుష్య రహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ-సైకిళ్లు ప్రపంచ రికార్డును నెలకొల్పాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసి, చిత్తూరు జిల్లా యంత్రాంగం గిన్నిస్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకుంది. ఈ ఈ-సైకిళ్ల తయారీ కోసం ఏపీ ప్రభుత్వం ‘ఈ-మోటోరాడ్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ప్రత్యేకతలు మరియు రాయితీ వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్కో సైకిల్ అసలు ధర రూ.35,000 కాగా, ప్రభుత్వం రూ.10,000 రాయితీ ప్రకటించింది. దీంతో లబ్ధిదారులకు కేవలం రూ.25,000లకే ఇది అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ సైకిళ్లను కుప్పంలోనే ఈ-మోటోరాడ్ సంస్థ అసెంబుల్ చేయడం విశేషం.
పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా పంపిణీ చేసిన 5,555 ఈ -సైకిళ్ల లబ్దిదారుల కొందరితో కలిసి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు ర్యాలీ నిర్వహించారు.… pic.twitter.com/LBQ9Cy5FKG
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 31, 2026
సీఎం చంద్రబాబు సైకిల్ ర్యాలీ
కుప్పంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, స్వయంగా ఈ-సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. తూంసీ నుంచి ప్రజావేదిక వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర వేలాది మంది లబ్ధిదారులతో కలిసి ఆయన ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డు ప్రతినిధుల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అవార్డును స్వీకరించగా, సీఎం దానిని ఆవిష్కరించారు.
‘పైసా ఖర్చు లేని ప్రయాణం’
ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "కుప్పం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో మీరు సైకిల్ గుర్తుకు ఓటేశారు, ఆ సైకిల్‌తోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నాం. ఈ 'సూపర్ సైకిళ్లను' మీ ఇంటిపై ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మైళ్ల దూరం ప్రయాణించవచ్చు" అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కుప్పాన్ని పూర్తి పర్యావరణ హిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం కేవలం రికార్డుల కోసం మాత్రమే కాదని, సామాన్యుడి రవాణా ఖర్చులను తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటమే తమ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
Follow Us