AP Cabinet : మహిళలకు ఫ్రీబస్సు, కొత్త రేషన్ కార్డులు.. ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవే!

ఏపీ సీఎం  నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు  కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఏపీ  సచివాలయంలో ప్రారంభమవుతుంది.12అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది

New Update
Ap cabinet

ఏపీ సీఎం  నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు  కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఏపీ  సచివాలయంలో ప్రారంభమవుతుంది.12అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. వీటిలో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలతో పాటు, పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. 

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై చర్చించి, దీనికి అధికారికంగా పేరు ఖరారు చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది. స్త్రీశక్తి అనే పేరును దాదాపుగా ఖరారు చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది.  

2024 నుంచి 2029కి ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిప్ట్) పాలసీ 4.0పై కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. తిరుపతి రూరల్ మండలం పేరూరులో 25 ఎకరాల భూమికి బదులుగా గతంలో ఓబెరాయ్ హోటళ్ల గ్రూపు నిర్మాణానికి ఇచ్చిన టీటీడీ ల్యాండ్ బదిలీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

200 యూనిట్లకు పెంచే ఆలోచనలో

 ఇక హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత కరెంట్ ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. దీనిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఏపీఎస్సీడీసీఎల్, ఏపీసీపీ డీసీఎల్‌లకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వరసగా రూ.3,545 కోట్లు, రూ.1029 కోట్లు మంజూరు చేసిన రుణానికి గానూ ప్రభుత్వ గ్యారెంటీపై కేబినెట్ చర్చించనుంది.  పాఠశాల విద్యలో పలు జీవోలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కాంప్రీహెన్సివ్ ఏపీ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025కు కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  కొత్త మద్యం పాలసీపై కూడా ఈ సమావేశంలో చర్చ జరపనున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతిలో 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు రెగ్యులర్ బేసిస్ మీద పోస్టుల క్రియేషన్‌కు కేబినెట్‌లో చర్చించి, ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. 

చేనేత కార్మికులకు  గుడ్ న్యూస్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 93,000 చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.  చేనేత కార్మికుల ఆర్థిక భద్రత కోసం రూ. 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద కార్మికులు తమ నెల ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తే, దానికి ప్రభుత్వం అదనంగా కొంత మొత్తం జత చేస్తుంది.  చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల చేనేత ఉత్పత్తుల ధరలు తగ్గి, వాటి అమ్మకాలు పెరుగుతాయి, తద్వారా కార్మికులకు ఎక్కువ ఆదాయం వస్తుంది.

Advertisment
తాజా కథనాలు