ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో మొత్తం తొమ్మిది ప్యానల్ డిస్కషన్స్, 50 స్టాళ్లలో డ్రోనతో ప్రదర్శనలు, అలాగే రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ లాంటి తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు డ్రోన్ షోను ఎంజాయ్ చేశారు. ప్రదర్శనల సందర్భంగా ఆయన ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారీగా జనం
ఈ డ్రోన్ సమ్మిట్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఆకాశంలో వివిధ రూపాల్లో వస్తున్న డ్రోన్‌ల విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. విమానం ఎగరడం, జాతీయ పతాకం రెపరెపలాడటం, బుద్ధుడు ధ్యానం చేయడం, భూమి తిరగడం లాంటి వాటిని డ్రోన్ల ద్వారా నిర్వాహకులు అత్యద్భుంగా ప్రదర్శించారు. అక్కడి వచ్చిన జనాలు రెప్ప వాల్చకుండా వాటిని అలానే చూస్తూ ఉండిపోయారు.
డ్రోన్ల ప్రదర్శనకు ముందు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఈ డ్రోన్ సమ్మిట్‌లో మాట్లాడారు. ఈరోజు అమరావతిలో జరుగుతున్న డ్రోన్ సమ్మిట్.. ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని పేర్కొన్నారు. 1995లో కొత్తగా వస్తున్న ఐటీని స్వీకరించామని.. దాని ఫలితమే ఈరోజు ఐటీ రంగంలో తెలుగువాళ్లు ముందున్నారని అభిప్రాయపడ్డారు. "భారతీయులు ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్నారు. కొత్తగా వచ్చే సాంకేతికతను అందిపుచ్చుకొని.. అవకాశాలను సృష్టించికోవడంలో ఏపీ ప్రభుత్వం ముందుంటుంది. వ్యవసాయం, మౌలిక వసతుల రంగాల్లో డ్రోన్లది ముఖ్యమైన పాత్ర.
నగరాల్లో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు డ్రోన్లు వినియోగించవచ్చు. వైద్యరంగంలో భవిష్యత్తులు అనేక మార్పులు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో రోగులు ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోవచ్చు. ప్రస్తుతం పలు దేశాలు యుద్ధాల్లో కూడా డ్రోన్లు వాడుతున్నాయి. కానీ మేము అభివృద్ధి కోసం డ్రోన్లను వినియోగిస్తాం. డ్రోన్లతో రౌడీషీటర్ల కదలికలపై కూడా నిఘా పెడతాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు డ్రోన్లు వినియోగిస్తాం.
పోలీసు శాఖలో కూడా డ్రోన్లను విస్తృత స్థాయిలో వినియోగించేలా కృషి చేస్తాం. ఇప్పడు నిజమైన సంపద అంటే డేటానే. డేటా సాయంతోనే అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరింత అభివృద్ధి చెందనున్నాయి. ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ లావాదేవీల్లో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ వన్‌గా ఉందని'' సీఎం చంద్రబాబు అన్నారు.