AP News: అనంతపురం జిల్లాలో 26 సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న ఓ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రత్న మీడియాకు వెల్లడించారు. గుడిబండ మండలం దిన్నే హట్టి గ్రామానికి చెందిన గొల్ల తిప్పి స్వామి భార్య కరియమ్మపై అనుమానంతో ఆరు నెలల పసికందును 1998 సంవత్సరంలో హత్య చేసి పరారయ్యాడు. కరియమ్మ ఫిర్యాదు మేరకు గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసి తిప్పి స్వామి కోసం గాలించిన ఆచూకీ లభించలేదు. దిన్నే హట్టి నుంచి పారిపోయిన తిప్పి స్వామి కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా న్యామనహళ్లి వద్ద అర్ధుడు అనే గ్రామంలో వ్యవసాయం కూలి పనులు చేసుకుంటూ మరో వివాహం చేసుకుని అక్కడే జీవనం సాగించేవాడు.
కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు:
ఈ క్రమంలో తిప్పి స్వామి రెండో భార్య కుమార్తె వివాహానికి సంబంధించి పెళ్లి పత్రికలు తీసుకొని దిన్నేహట్టికి వచ్చాడు. వారసత్వంలో వచ్చిన భూమికి సంబంధించి కూడా పంపకాలు ఉండడంతో ఆ పని నిమిత్తం నిత్యం దిన్నే హట్టికి వచ్చి వెళుతుండేవాడు. లాంగ్ పెండింగ్ కేసుల్లో భాగంగా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు విషయం తెలుసుకుని పెళ్లి పత్రిక ఆధారంగా నిందితుని కోసం ఆరా తీశారు. ఈనెల 25వ తేదీన భూమి పంపకాల విషయమై దిన్నే హట్టికి తిప్పి స్వామి రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, పాతన్న, మహమ్మద్‌రఫీ, గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్, వెంకటేశ్, నరేశ్, కానిస్టేబుల్ మల్లికార్జున, హోంగార్డు హరికుమార్‌లను ఎస్పీ రత్న, అదనపు ఎస్పీ ఆళ్ల శ్రీనివాసులు అభినందించి వారికి రివార్డు అందజేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
ఇది కూడా చదవండి: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ ఆహారాలు ముట్టుకోకూడదు