Janasena Glass Symbol: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలైన నేపథ్యంలో ఏపీలో అద్భుత విజయాన్ని అందుకున్న జనసేనకు మరో శుభవార్త. గత కొంత కాలం నుంచి గాజు గ్లాసు సింబల్ విషయంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదానికి త్వరలోనే స్వస్తి పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా ఎన్నికల్లో జనసేన సాధించిన విజయంతో గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి ఎలక్షన్ కమిషన్ (Election Commission) శాశ్వతంగా కేటాయించనుంది. త్వరలోనే దీనిపై కీలక ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. సాధారణంగా ఓ పార్టీకి శాశ్వత గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు సాధించి ఉండాలి.
గెలిచిన సీట్లలో కనీసం రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెలవాలి. కానీ, తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన జనసేన.. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ సీట్లలోనూ ఘన విజయం సాధించింది. ఇక జనసేన మొత్తంగా 8.53 శాతం ఓట్ షేర్‌ను దక్కించుకుంది.