YCP Manifesto 2024: మార్చి 20న వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. నిజానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం(మార్చి 12) సందర్భంగా జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే అది జరగలేదు. ఇక టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. రైతులు, మహిళలు టార్గెట్‌గా కొత్త పథకాలు ఉండనున్నాయి. ఏపీ ఎన్నికలపై (AP Elections 2024) తెలంగాణ పథకాల ప్రభావం పడింది. ఆరు గ్యారంటీల తరహాలో టీడీపీ, వైసీపీ మేనిఫెస్టో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. కూటమికి ధీటుగా కొత్త పథకాలతో జగన్ (CM Jagan) రాబోతున్నారని సమాచారం.
Also Read: పవన్, బాలయ్య, లోకేశ్ పై పోటీకి మహిళా అభ్యర్థులు.. జగన్ స్కెచ్ అదుర్స్!
మేనిఫెస్టోపై గ్లింప్స్:
మేనిఫెస్టోపై సీఎం జగన్ ఇప్పటివకే పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరిగిన బహిరంగ సభలోనూ మేనిఫెస్టోపై జగన్ మాట్లాడారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని చెప్పారు జగన్. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నానన్నారు. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామన్నారు. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీకి ఓటు వేస్తే పేదరికపు సంకెళ్లు తెంచుకుని రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు వస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి పల్లెకు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తోందని, 175/175 అసెంబ్లీ సీట్లు, 25/25 పార్లమెంట్ సీట్లు గెలుచుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు జగన్. వెనుకబడిన వర్గాల ప్రజలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించి సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అని తెలిపారు.