Cyber Crime: సైబర్ నేరాలతో అనేక మందిని మోసం చేస్తున్న ఒక ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. దొరికిన చిన్న లింక్ ను పట్టుకున్న పోలీసులు వేట సాగించగా.. మూలాలు దుబాయ్ లో ఉన్నట్టు తేలింది. అంతే కాకుండా సైబర్ నేరాలలో ఆరితేరిపోయిన కింగ్ పిన్ దీని వెనుక ఉన్నట్టు పసిగట్టారు.
ఏపీ తెలంగాణలోని కొందరు వ్యక్తులు డబ్బు ఆశతో ఈ గ్యాంగ్ లో పని చేస్తున్నారని. కేవలం వన్ పర్సెంట్ కమీషన్ తీసుకుని కింగ్ పిన్ కు సహకరిస్తున్నట్టు తేల్చారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఒక యువకుడిని ఆన్ లైన్ జాబ్ పేరుతో వలలోకి దింపి డబ్బు కాజేశారు. దీంతో బాధితుడు జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సైబర్ టీం.. కేవలం కొద్ది రోజుల్లోనే ఐదుగురు సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్టు చేశారు.
Also read: హీరో బాలకృష్ణకు ఎమ్మెల్సీ సునీత మాస్ వార్నింగ్.!
ఇందులో అనంతపురంకి చెందిన ఒక మహిళ కూడా ఉంది. 16 ఫేక్ అకౌంట్ల ద్వారా 35.59 కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో 14.72 లక్షలు మాత్రమే జిల్లా పోలీసులు ఫ్రీజ్ చేయించగలిగారు. దేశ వ్యాప్తంగా NCRB పోర్టల్ లో 1550 ఫిర్యాదులు ఉన్నాయని.. వీటిలో లావాదేవీలు అంచనా వేస్తే సుమారు 350 కోట్ల పైమాటని ఎస్పీ అన్బూరాజన్ వెల్లడించారు.
యూట్యూబ్ యాడ్స్ సబ్ స్కైబ్, రేటింగ్ లకు అధిక కమీషన్లు ఇస్తామంటూ మోసాలు చేసి.. ఆన్లైన్ గేమింగ్, జాబ్ ఫ్రాడ్స్, ఓటిపి, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ...ఈ తరహా సైబర్ మోసాల ద్వారా అమాయకులను మోసం చేస్తున్నట్టు తెలిపారు. ఈ సొమ్ము మొత్తం దుబాయ్ వరకు లావాదేవీలు జరిపినట్లు జిల్లా సైబర్ పోలీసుల విచారణలో తెలిందన్నారు. సైబర్ నేరాలలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తర భారత దేశానికి చెందిన ఓ కింగ్ పిన్ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండాలని సూచించారు.