Flight Emergency Landing: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులకు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. సాధారణంగా ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితోనో, ప్రయాణికుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సాయం అవసరమైతేనో, బాంబు బెదిరింపులు, వాతావరణం సహకరించకపోవడం వంటివి జరిగితేనో..విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడం ఇప్పటి వరకు చూసి ఉంటాం.
కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ తలలో పేల వల్ల విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన జూన్ లోనే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్‌కు బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా.. ఓ మహిళ తలలో పేలు పాకుతుండటాన్ని చూసిన తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. దీంతో విమానాన్ని ఫీనిక్స్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎథాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్నిసోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
‘విమానాన్ని మళ్లిస్తున్నట్టు మాత్రమే విమాన సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. నేను చుట్టూ చూశాను. ఎవరూ భయపడడం లేదు. అయినా విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే ఓ మహిళ విమానం ముందువైపునకు దూసుకెళ్లింది. ఆ తర్వాత విమానం ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని తోటి ప్రయాణికుడిని అడిగితే అసలు విషయం తెలిసింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండటాన్ని ఇద్దరు ప్రయాణికులు చూసి విమాన సిబ్బందికి చెప్పారని... విమాన సిబ్బంది వచ్చి చూస్తే నిజంగానే ఆమె తలలో పేలు పాకుతుండటంతో.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు’ అని సదరు ప్రయాణికుడు వివరించారు.
ఈ ఘటన కారణంగా విమానం 12 గంటలు ఆలస్యమైనట్లు చెప్పారు.