Ambati Rambabu: ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ముద్రగడ కి బొకే ఇచ్చి శాలువా కప్పబోతుండగా.. ఆయన వద్దని, తనకు ఇలాంటివి నచ్చవని వారించారు.
ఈ క్రమంలో అంబటి మాట్లాడుతూ.. ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని తెలిపారు. కాపుల కోసం.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని నడిపి వ్యక్తి ముద్రగడ పద్మనాభమని అన్నారు. రాజకీయాల్లో నష్టపోయినా.. ఏనాడు కులాన్ని మాత్రం ఉపయోగించుకోలేదని వివరించారు. ప్రత్యర్థుల సవాల్‌ను స్వీకరించి తన పేరు మార్చుకున్న వ్యక్తి ముద్రగడ అని ఆయన గుర్తు చేశారు. అందుకే ఆయన్ని అభినందించేందుకు తాను కిర్లంపూడి వచ్చినట్లు అంబటి వివరించారు.
అలాగే ముద్రగడకు తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అంబటి రాంబాబు వివరించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గెలిస్తే.. తన పేరు మార్చుకుంటానని ఎన్నికల ప్రచార వేళ ముద్రగడ పద్మనాభం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు ఓటు వేసి గెలిపించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రకటించిన ప్రకారం పేరు మార్చుకోవాలంటూ ముద్రగడపై సోషల్ మీడియాలో ఒత్తిడి పెరిగింది.
దాంతో ఆయన అన్నట్లుగానే తన పేరును మార్చుకున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి కోసం ప్రత్యర్థి పార్టీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. ఆ క్రమంలో ఆ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా వంగా గీతను బరిలో నిలిపింది. అంతేకాదు.. నాటి సీఎం వైయస్ జగన్ సైతం.. తన ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలోనే నిర్వహించిన విషయం తెలిసిందే.