NEET Re Exam: మళ్ళీ పెట్టిన పరీక్షలో అసలు రంగు బయటపడింది. అప్పుడు 720 కు 720 వచ్చిన వాళ్ళకు ఇప్పుడు 682 మార్కులు దాటలేదు. హర్యానాలో ఒక సెంటర్లో నీట్ ఎగ్జామ్ రాసిన ఆరుగురికి ఫుల్ మార్కులు వచ్చాయి. దీంతో మొత్తం నీట్ పరీక్ష నిర్వహణపైనే అనుమానాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా పెద్ద గొడవే జరిగింది. దాని తర్వాత గ్రేసు మార్కులు కలపవడం వల్లే అలా జరిగిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇచ్చుకుంది. దాని తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి రీటెస్ట్ నిర్వహించారు. దాని ఫలితాలు ఇవాళ వచ్చాయి. అయితే ఇందులో రిజల్ట్ వేరేగా వచ్చింది.
హర్యానాలో బహాదుర్‌ఘడ్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్‌లో మొత్తం 494 మంది పరీక్ష రాశారు. ఇందులో ఇంతకు ముందు ఫుల్ మార్కులు వచ్చిన వారికి రీఎగ్జామ్ నిర్వహిస్తే.. వాళ్లలో ఎవరికీ 700 దాటలేదు. ఆ సెంటర్‌లో హయ్యెస్ట్ మార్కులు 682 మాత్రమే. మరో పదమూడు మందికి 600కి పైగా మార్కులు వచ్చాయి. మొదట వెల్లడైన ఫలితాలకు వీటికి మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది.
గతంలో జరిగిన నీట్ యూజీ పరీక్షలో 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో 24 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే షెడ్యూల్ కంటే ముందుగా జూన్ 4న ఫలితాలు ఇవ్వడం, అందులోనూ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అభ్యర్థుల్లో అనుమానాల్ని రేకెత్తించింది. ఈ గొడవ సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో రీటెస్ట్ నిర్వహించారు. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి 813 మంది మాత్రమే మళ్ళీ పరీక్ష రాశారు.